- సెక్రటేరియట్ ముట్టడికి జర్నలిస్టుల యత్నం.. అరెస్ట్
సైఫాబాద్, వెలుగు: గన్ పార్క్ నుంచి సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన ‘చలో హైదరాబాద్’ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్లుగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులను చిన్నచూపు చూడటం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణలో అనేక చిన్న, మధ్యతరహా పత్రికలు మూతపడే పరిస్థితి వచ్చిందని, రెండున్నరేళ్లుగా అడ్వర్టైజ్‌మెంట్ బిల్లులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఉచిత విద్య అందించాలని కోరారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించగా, పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. పంజాగుట్ట, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నిరసనలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు బండి విజయ్ కుమార్, యాదగిరి, తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిర్రా శ్రీనివాస్, దామెర జగదీశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
