హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర మూడో మహాసభలను వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో నిర్వహించాలని సంఘం రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహాసభల నిర్వహణకు 23 మందితో అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేశారు.
జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వ పెద్దలు, అధికారులకు వినతిపత్రాలు అందించాలని మీటింగులో నిర్ణయించారు. కాగా.. మామిడి సోమయ్య, విజయ్ కుమార్, జగన్, తన్నీరు శ్రీనివాస్, బాపూరావుల ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సమావేశం ప్రకటించింది. బహిష్కృతులకు ఇకపై టీడబ్ల్యూజేఎఫ్‌తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది.సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, ఉపాధ్యక్షులు జి. మాణిక్ ప్రభు, తాటికొండ కృష్ణ, గుడిగ రఘు, బి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
