ఇంక్రిమెంట్ సెటిల్​మెంట్ కోసం లంచం డిమాండ్ 

 ఇంక్రిమెంట్ సెటిల్​మెంట్ కోసం లంచం డిమాండ్ 

మహబూబాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఆడిటర్లు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన ఎండీ సలీం పాషా ..మహబూబాబాద్​ సీసీఎస్​లో కానిస్టేబుల్. ఇటీవల ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. జులై 31న అతడి ఇంక్రిమెంట్లకు సంబంధించిన ఫైల్ జిల్లా ఆడిట్ ఆఫీస్ కు చేరింది. సెటిల్​మెంట్​చేయడం కోసం సీనియర్ ఆడిటర్ జి. శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ కిశోర్​ రూ. 25 వేల లంచం అడిగారు. అంత ఇచ్చుకోలేనని, రూ. 18 వేలు ఇస్తానని ఒప్పుకున్న పాషా ఈ నెల 9న  ఏసీబీని సంప్రదించాడు. వారి సూచనలతో శుక్రవారం ఆడిట్ఆఫీస్​లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కిశోర్​ దగ్గరకు రూ.18 వేల క్యాష్​తో వెళ్లాడు. సీనియర్ ఆడిటర్ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడిన కిశోర్​డబ్బులు తీసుకుని లెక్కపెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. తర్వాత ఇద్దరి ఇండ్లల్లో తనిఖీలు చేశారు. నిందితులను  హైదరాబాద్​ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, శ్రీను , తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.