హైదరాబాద్, వెలుగు: మెదడు సంబంధిత సమస్యలతో వేర్వేరు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు మహిళల కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో అవయవదానం చేసి ఎనిమిది మంది ప్రాణాలను నిలిపారు. రంగారెడ్డి జిల్లా మణికొండ సన్ షైన్ ఐరిస్‌కు చెందిన ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ ఉమెనర్జీ, వి ఎయిమ్ సంస్థల వ్యవస్థాపకురాలు మడుగుల దీప్తిరెడ్డి (42) ఈ నెల 22న తీవ్రమైన తలనొప్పితో మెదడులో రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు సిటీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా, చికిత్స పొందుతూ 26న బ్రెయిన్ డెడ్ అయ్యారు.
దీంతో ఆమె భర్త ప్రదీప్ రెడ్డి 2 కిడ్నీలు, లివర్, గుండెను దానం చేయడానికి అంగీకరించారు. మరో ఘటనలో ఘట్ కేసర్ మండలం కొర్రెముల సమీపంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గృహిణి నేరుడి శారద (43) ఈ నెల 23న తీవ్రమైన తలనొప్పి, వాంతులతో ఇంట్లోనే కుప్పకూలిపోగా కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి 26న బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె భర్త నర్సింగరావు 2 కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులను దానం చేసేందుకు ముందుకొచ్చారు.
వీరిద్దరి ఔదార్యంతో మొత్తం 8 మంది రోగులకు అవయవ మార్పిడి జరిగి పునర్జన్మ లభించింది. ఈ ఏడాది జీవన్‌దాన్ 153, 154వ బ్రెయిన్ డెడ్ డొనేషన్ల మైలురాయిగా నమోదయ్యాయని నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు. అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచిన బాధిత కుటుంబాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
