ఇబ్రహీంపట్నం, వెలుగు: ఒక బైక్‌ను మరో బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తుర్కయంజాల్ కట్టపై కట్టమైసమ్మ ఆలయం సమీపంలో సోమవారం జరిగింది. సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. బీఎన్‌రెడ్డి నగర్ నుంచి తుర్కయంజాల్ వైపు బైక్‌పై అష్రఫ్ అన్సారీ, సోహైల్ మన్సూరి(16) వెళ్తున్నారు.
ఈ క్రమంలో వెనుక నుంచి స్పీడ్‌గా వచ్చిన బుల్లెట్ బైక్ వారిని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అదే మార్గంలో వస్తున్న కాలేజీ బస్సు సోహైల్ మన్సూరిపై నుంచి వెళ్లి, రోడ్డుమధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది.
గాయపడిన సోహైల్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అష్రఫ్ అన్సారీ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
