
- ఐదు నెలల్లో అనారోగ్యంతో తల్లిదండ్రుల కన్నుమూత
- టీబీతో తల్లి ..ఫిట్స్‌తో తండ్రి మృతి
- ఆప్యాయత, అనురాగాలకు దూరమైన పసివాళ్లు
- ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
కొడిమ్యాల, వెలుగు : అమ్మానాన్నలే ప్రపంచంగా బతుకుతూ అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారులు అన్నా చెల్లెళ్లు...కొంతకాలం క్రితం వరకు అమ్మ జోల పాటల మధ్య ఆమె ఒడిలో ఆడుకుంటూ సేదదీరారు. తల్లీ పిల్లల ఆప్యాయతను చూసి కన్నుకుట్టిన విధి అమ్మను టీబీ రూపంలో బలి తీసుకుంది. దీంతో తల్లి ఆలనా పాలనకు దూరమయ్యారు. ఇక తండ్రినే అమ్మానాన్న అనుకుని బతుకుతుండగా విధి మరోసారి పంజా విసిరింది. తండ్రి కూడా ఫిట్స్‌తో కన్నుమూయడంతో చావు అంటే ఏమిటో తెలియని వయస్సులో తండ్రికి ఏమైందో తెలియకుండా బిక్క చూపులు చూస్తున్నారు. నానమ్మ, తాత ఉన్నా వారు వృద్ధులు కావడం, కూలీ చేసుకుంటేనే రోజు గడిచే పరిస్థితి ఉండడంతో పిల్లల భవిష్యత్అగమ్యగోచరంగా మారింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లికి చెందిన కొత్తపల్లి కిషన్, పూజలకు పదేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి కొడుకు మణిదీప్(6) బిడ్డ దివ్యశ్రీ(2) ఉన్నారు. కిషన్ పెయింటింగ్ వర్క్ చేసేవాడు. నెలంతా కష్టపడ్డా రూ.10 వేలు కూడా వచ్చేవి కావు. అయినా, ఉన్నంతలో భార్యాపిల్లలతో జీవితాన్ని సాఫీగా సాగించాడు.
అయితే, పూజకు కొంతకాలం కింద టీబీ సోకడంతో అక్కడా ఇక్కడ రూ.రెండు లక్షలు అప్పులు చేసి మందులు వాడారు. అయినా వ్యాధి ముదరడంతో ఐదు నెలల కింద కన్నుమూసింది. కిషన్ ధైర్యం చెడకుండా పిల్లలను చూసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో కిషన్‌కు కూడా టీబీ సోకడం, ఫిట్స్ రావడం మొదలైంది. ఈ నెల 2న ఫిట్స్రాగా కిషన్ చనిపోయాడు. దీంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన నానమ్మ, తాత ఉన్నా వారినే మరొకరు చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిల్లలకు రూ.15వేల నగదు, రెండు నెలలకు సరిపడా సరుకులు పంపించగా.. ప్యాక్స్ చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, చిలువేరి నారాయణ, మ్యాకల మల్లేశం, జీవన్ రెడ్డి పిల్లలకు అందజేశారు. దాతలు, ప్రభుత్వం పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.