కోల్డ్ స్టోరేజ్​ లపై ఎక్సైజ్ దాడులు.. కోటి 20 లక్షల విలువైన 30 టన్నుల నల్ల బెల్లం స్వాధీనం

 కోల్డ్ స్టోరేజ్​ లపై ఎక్సైజ్ దాడులు.. కోటి 20 లక్షల విలువైన 30 టన్నుల నల్ల బెల్లం స్వాధీనం

ఎల్ బీనగర్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. రెండు కోల్డ్ స్టోరేజ్​లపై దాడులు చేసి నిషేధిత నల్ల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం..  ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పీఎస్ పరిధి పటేల్ గూడలోని చేపురి ఆగ్రో కోల్డ్ స్టోరేజ్, హయత్ నగర్ ఎక్సైజ్ పీఎస్ పరిధి కోహెడ వద్ద ఉన్న వైష్ణవి కోల్డ్ స్టోరేజ్​లపై మంగళవారం పోలీసులు దాడులు చేశారు.

చేపురి ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ నుంచి 22 టన్నులు, వైష్ణవి కోల్డ్ స్టోరేజ్ నుంచి 8 టన్నులు.. మొత్తం 30 టన్నుల నల్లబెల్లంను స్వాధీనం చేసుకుని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. పట్టుబడ్డ నల్లబెల్లం రూ. కోటి 20 లక్షలు ఉంటుందని.. దాన్ని సీజ్ చేశామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రయ్య తెలిపారు. రెండ్రోజుల కిందట ఇబ్రహీంపట్నం పరిధిలో గుడుంబా స్థావరాలపై దాడులు చేసి తయారీదారులను పట్టుకొని విచారించామన్నారు. కోల్డ్ స్టోరేజ్​ల నుంచి వీరికి నల్లబెల్లం సప్లయ్ అవుతున్నట్లు తెలుసుకొని.. మంగళవారం ఆ స్టోరేజ్​లపై దాడులు చేసినట్లు చంద్రయ్య తెలిపారు. ఈ దాడుల్లో సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రావు, ఇబ్రహీంపట్నం, హయత్ నగర్ ఎక్సైజ్ సీఐలు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.