కశ్మీర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం.. చైనీస్ పిస్టల్స్ స్వాధీనం

కశ్మీర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం.. చైనీస్ పిస్టల్స్ స్వాధీనం

కశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులను జవాన్లు మట్టుబెట్టారు. మరణించిన ఇద్దరూ పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా ఉగ్రవాదులని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్పాట్‌లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

సోపియన్ జిల్లాలోని ఖాజ్పురా రెబాన్ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సోమవారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉదయం 10 గంటల సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. దాదాపు మూడు నాలుగు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

మృతులను కుల్గామ్‌కు చెందిన షబీర్ అహ్మద్ మాలిక్, వాదినామెల్హౌరా ప్రాంతానికి చెందిన ఆమిర్ అహ్మద్ దార్‌గా గుర్తించారు కశ్మీర్ పోలీసులు. ఇద్దరూ పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలో శిక్షణ పొంది.. పలు ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు పౌరులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని చెప్పారు. షబీర్ 2017 డిసెంబర్ నుంచి, అహ్మద్ దార్ 2019 నుంచి లష్కరేతో యాక్టివ్‌గా పని చేస్తున్నారని తెలిపారు. ఘటనా స్థలంలో ఒక ఏకే-47, ఒక గ్రనేడ్ లాంచర్, ఒక ఏకే-47 మేగజైన్, చైనీస్ పిస్టల్స్, ఆ పిస్టల్ మేగజైన్ ఒకటి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు చెప్పారు.