
- తెలంగాణలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్
ఇండియాలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ తెలంగాణలో రానుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం వద్ద ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కాంట్రాక్టును బీహెచ్‌ఈఎల్ దక్కించుకుంది. బీహెచ్‌ఈఎల్‌కు దీంతోపాటు గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి మరో 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకూ ఆర్డరు లభించింది. రెండు ఆర్డర్ల విలువ రూ. 800 కోట్లు. తాజా ఆర్డర్లతో బీహెచ్‌ఈఎల్ సోలార్ పోర్ట్‌ఫోలియో వెయ్యి మెగావాట్ల (గిగావాట్) మార్క్‌ను తాకింది. గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆర్డర్ కింద మరో 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను బనస్కంత జిల్లాలో నిర్మిస్తోందని అధికారులు తెలిపారు. బీహెచ్‌ఈఎల్ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆఫ్ గ్రిడ్, గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ ప్లాంట్లకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ సొల్యుషన్స్‌ను ఆఫర్ చేస్తోంది. బీహెచ్‌ఈఎల్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలోని 1 గిగావాట్ల సోలార్ ప్లాంట్లలో ఇప్పటికే 500 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లను ఏర్పాటు చేయడం పూర్తయింది. సోలార్ ప్లాంట్ల సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.