హైదరాబాద్ సిటీలో భగ్గుమంటున్న ఇంటి అద్దెలు.. జీతంలో సగం రెంట్, మెయింటెనెన్స్ కే పోతుంది

హైదరాబాద్ సిటీలో భగ్గుమంటున్న ఇంటి అద్దెలు.. జీతంలో సగం రెంట్, మెయింటెనెన్స్ కే పోతుంది
  •     ఐటీ కారిడార్ లో విపరీతంగా పెరిగిన అద్దెలు  
  •     షిఫ్టింగ్​ బాధ తప్పించుకునేందుకు లగ్జరీ, ఫర్నీష్డ్​ ఇండ్లకు మొగ్గు  
  •     అందనంత దూరంలో  వెస్ట్ హైదరాబాద్ లో ఇండ్ల రెంట్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్ముకుని జీవిస్తున్న చిరు వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర రంగాల వారు అద్దెల భారాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా ముందు(2019–20) రెంట్లు తక్కువగానే ఉండేవి. ఐటీ కారిడార్ సమీపంలోని కాలనీల్లో మోస్తరు వసతులున్న సింగిల్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్ ఇల్లు రూ.6 వేల నుంచి రూ.9 వేల వరకు ఉండేది. డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్ ఇళ్లు రూ.12 వేల నుంచి రూ.18 వేల లోపు దొరికేవి. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ముగించి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం, గ్లోబల్ కంపెనీలు పెద్ద క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేయడంతో ఇండ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ప్రస్తుతం 2బీహెచ్​కే ఫ్లాట్ అద్దె రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు పలుకుతోంది. సింగిల్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్ ఇల్లు కూడా రూ.15 వేలు చెల్లిస్తేనే దొరికే పరిస్థితి ఉంది. జూనియర్ ఐటీ ఉద్యోగుల జీతం రూ.40 వేల నుంచి 50 వేల మధ్య ఉంటే, అందులో 40 నుంచి 45 శాతం వరకు అద్దెకే వెచ్చించాల్సి వస్తోంది. మిడ్-లెవెల్ మేనేజర్ల జీతం రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు ఉన్నా, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేవారు జీతంలో 35 శాతం పైగా అద్దె, మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఖర్చు చేస్తున్నారు. షిఫ్టింగ్ ఇబ్బందులు తప్పించుకోవడానికి చాలామంది ఏసీ, టీవీ, మాడ్యులర్ కిచెన్, మంచాలు వంటి ఫర్నిష్డ్ ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు మార్కెట్ రేటు కంటే 30 నుంచి 50 శాతం ఎక్కువ అద్దె చెల్లించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కోకాపేట్, ఖాజాగూడలోని లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలకు అద్దెలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల ‘వేకెన్సీ రేట్’ 2 శాతం కంటే తక్కువగా ఉంది.

ఈ ఏరియాల్లోనూ తగ్గట్లే..

మెహిదీపట్నం, అత్తాపూర్, సోమాజిగూడ, బేగంపేట్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, నారాయణగూడ, నాంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా అద్దెలు భారీగా పెరిగాయి. సింగిల్ లేదా డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్ ఇల్లు కావాలంటే రూ.10 వేల నుంచి రూ.30 వేలకుపైగా చెల్లించాల్సి వస్తోంది. హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, మార్కెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇళ్లు దొరకడం కష్టమవుతోంది. మెట్రో ఫేజ్-2 పనులు, రీజినల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కారణంగా ఉప్పల్, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీనగర్, అల్వాల్ వంటి బడ్జెట్ ప్రాంతాల్లో కూడా అద్దెలు పెరుగుతున్నాయి.

మెయింటెనెన్స్ భారం అదనం..

కేవలం అద్దె మాత్రమే కాదు.. అదనపు ఖర్చులు కూడా మధ్యతరగతి నడ్డి విరుస్తున్నాయి. అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో మెయింటెనెన్స్ చార్జీల పేరిట నెలకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు కరెంట్ బిల్లులు, నిత్యావసర ఖర్చులు, వైఫై బిల్లులు చేరడంతో ఇంటి నిర్వహణకే జీతంలో సగానికి పైగా ఖర్చవుతోంది. జూన్ నెలలో స్కూల్, కాలేజీ ఫీజులు, బుక్స్, అడ్మిషన్లు, యూనిఫాంల భారం కూడా కుటుంబాలపై పడింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా గుదిబండగా మారాయి. దీంతో చాలా కుటుంబాలు అద్దెల భారాన్ని తట్టుకోలేక శివార్లకు, ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి.

అనరాక్ నివేదికలోనూ ఇదే..

అనరాక్​ నివేదిక ప్రకారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సగటు ఇళ్ల చదరపు అడుగు ధర ఏడాదిలో 7 శాతం పెరిగింది. గత ఏడాది స్క్వేర్ ఫీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.8,868 ఉండగా, ప్రస్తుతం రూ.9,456కు చేరింది. ఇళ్ల కొనుగోలు ధరలు పెరగడంతో ఆ భారాన్ని కవర్ చేసేందుకు యజమానులు అద్దెలు పెంచుతున్నారు. నగరంలో కొత్త ఇళ్ల నిర్మాణం గత ఏడాదితో పోలిస్తే 87 శాతం పెరిగినా, ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విస్తరణతో ఉద్యోగుల వలసలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఇండ్ల కొరత కొనసాగుతూ అద్దెలు 
మరింత పెరుగుతున్నాయి.