రోడ్డు మీద పోతుంటే ఇంట్లోకి లాక్కెళ్లి..అత్యాచారం.. హత్య

V6 Velugu Posted on Sep 23, 2021

నల్గొండ క్రైం, వెలుగు: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమె తలను నేలకు, గోడకేసి కొట్టి దారుణంగా చంపేశారు. ఆధారాలు దొరక్కుండా రక్తపు మరకలను కడిగేశారు. మృతదేహాన్ని బయట రేకుల షెడ్​ కింద పడేశారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో బుధవారం పొద్దున 11 గంటల సమయంలో జరిగింది. 
ఇంటి దగ్గరకు రాగానే..
నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇంటికి కొద్ది దూరంలో ఆ దంపతులు కిరాణా షాపు నడిపిస్తున్నారు. భార్య (54) ఉదయం షాపుకు బయలుదేరింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బక్కతొట్ల లింగయ్య ఇంటిదగ్గరకు రాగానే లింగయ్య (35), ఏర్పుజర్ల పుల్లయ్య (35) కలిసి ఇంట్లోకి లాక్కెళ్లారు. 


ఆ టైమ్​లో ఇద్దరూ ఫుల్లుగా తాగి ఉన్నారు. బయట వాన పడుతుండటం, ఆమె మాట బలంగా లేకపోవడంతో అరుపులు ఎవరికీ వినిపించలేదు. లింగయ్య, పుల్లయ్య ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని ఇంటి బయట రేకుల షెడ్​లో పడేశారు. తర్వాత లింగయ్యను మృతదేహం దగ్గర ఉంచి పుల్లయ్య రోడ్డుపైకి వెళ్లాడు. స్కూలు దగ్గర ఆ మహిళ మరిది కనిపించడంతో దగ్గరికెళ్లి ‘మీ వదిన రోడ్డుపై పడి ఉంది’ అని చెప్పాడు. అతను పరుగున వచ్చి చూడగా రక్తపు మడుగులో ఆమె కనిపించింది. 
వంట గది, బెడ్రూమ్​లో రక్తపు మరకలు
ఇంట్లో వంట గది, బెడ్రూంలో గాజులు పడి ఉండటంతో పాటు రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఇద్దరూ అత్యాచారం చేశారని చెప్పారు. భర్త భిక్షమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు.    
ఇద్దరిదీ నేర చరిత్రే
లింగయ్య, పుల్లయ్య ఇద్దరూ కూలీలు. పుల్లయ్య మొదటి భార్య విడాకులు తీసుకోవడంతో రెండో పెండ్లి చేసుకున్నాడు. రెండో భార్య, ఏడాది వయసున్న కూతురును చంపేశాడు. లింగయ్య వారం క్రితం గ్రామంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. మందు మత్తులో తప్పు చేసి ఉంటాడని, క్షమించాలని లింగయ్య భార్య బతిమాలడంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. లింగయ్య ప్రవర్తన నచ్చక పిల్లలతో కలిసి భార్య పుట్టింటికి పోయింది.

Tagged woman, NALGONDA, Rape,

Latest Videos

Subscribe Now

More News