మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్

 మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్
  • చెరువులు, ప్రాజెక్టులకు జలకళ 

  •  ఏజెన్సీ గ్రామాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 

  • గోదావరిలో పెరుగుతున్న వరద.. మేడిగడ్డకు 2 లక్షల క్యూసెక్కులు 

  • మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మస్తు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండగా, మరికొన్ని జిల్లాల్లో ముసురు పట్టుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ జిల్లాల్లోని వందలాది ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆఫీసర్లు రద్దు చేశారు. ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదే జిల్లా వాజేడు మండలంలోని బొగత, కొంగల, మహితపురం జలపాతాలతో పాటు వెంకటాపురం మండలంలోని ముత్యంధార జలపాతం పరవళ్లు తొక్కుతున్నాయి. 

రాష్ట్రమంతా మస్తు వానలు

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గోదావరిలో వరద ప్రవాహం పెరగడం, మరో రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదావరి తీర ప్రాంత ప్రజలను ఆఫీసర్లు అప్రపత్తం చేశారు. 

కన్నాయిగూడెంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం.. 

గత 24 గంటల్లో అత్యధికంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం, వెంకటాపూర్‌‌, తాడ్వాయి మండలాల్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో 8.5, కమలాపూర్ లో 8.3, పరకాలలో 8.1, హసన్ పర్తి మండలంలో 7.5, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో 6, దుగ్గొండి మండలంలో 5, వరంగల్ లో 4.6, ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో 6.3, సిద్దిపేట జిల్లా కోహెడలో 6, దుబ్బాకలో 6, హుస్నాబాద్ లో 5.4,  బెజ్జంకిలో 4.8, సిద్దిపేట రూరల్ మండలంలో 4.4, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 7.1, గంభీరావుపేటలో 6.1, తంగళ్లపల్లి మండలంలో 6.1, ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి కేలో 2.9, నార్నూర్, బేల, చప్రాలలో 2.8,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెం, పినపాకలలో 2.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. 

ఆసిఫాబాద్ లో స్తంభించిన జనజీవనం.. 

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. సిర్పూర్ టి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో వాగులు ఉప్పొంగి వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెంచికల్ పేట్, బెజ్జూర్, కౌటల మండలాల్లో వరద పరిస్థితిని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంగళవారం పరిశీలించారు. వరద ప్రభావం ఉండే గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం వీరాపురం గ్రామానికి చెందిన సోలం వాణి అనే గర్భిణి ఎలిషెట్టిపల్లి, చల్పాక గ్రామాల మధ్య జంపన్న వాగు దాటలేక ఆగిపోయింది. విషయం తెలుసుకున్న ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్  గర్భిణిని సురక్షితంగా వాగు దాటించి 108 అంబులెన్స్ ద్వారా మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, వరంగల్​లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. బల్దియాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

ఉప్పొంగిన ప్రాణహిత.. 

ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉంది. దీంతో 35 గేట్లు ఓపెన్ చేసి, వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. దిగువన ఇంద్రావతి నుంచి కూడా 50 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో సమ్మక్క(తుపాకులగూడెం) బ్యారేజీ గేట్లను ఓపెన్ చేసి, పైనుంచి వస్తున్న వరదను పూర్తిగా దిగువకు పంపిస్తున్నారు. దీంతో పూసురు వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. 

ప్రాజెక్టుల్లోకి వరద.. 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి 17,215 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (90 టీఎంసీలు) కాగా,  ప్రస్తుతం 1,071.1 అడుగుల(32.211 టీఎంసీలు)  నీటిమట్టం ఉందని ప్రాజెక్ట్ ఏఈ రవి తెలిపారు. దీంతో ప్రాజెక్టులోకి కాళేశ్వరం రివర్స్ పంపింగ్​ ద్వారా నీటి విడుదలను నిలిపి వేసినట్లు ప్రకటించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో బాసర వద్ద గోదావరిలో నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి17,728 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతుండగా, ఇందులో పార్వతి బ్యారేజీ నుంచే 15,660 క్యూసెక్కులు లిఫ్ట్​చేస్తున్నారు. క్యాచ్​మెంట్​ ఏరియా నుంచి కేవలం 2,068 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 14.923 టీఎంసీల నీరుంది. నిర్మల్​జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ లోకి ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కడెం ప్రాజెక్టుకు ప్రస్తుతం 1,464 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది. గతేడాది పరిస్థితుల నేపథ్యంలో ఏమాత్రం ఇన్​ఫ్లో పెరిగినా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కుమ్రంభీమ్ ప్రాజెక్ట్ లోకి 208 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 10 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులో 5.6 టీఎంసీల నీటిని కొనసాగిస్తూ 5వ గేటు ద్వారా  208 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. చత్తీస్​గడ్ లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వస్తున్నది. దీంతో 15 గేట్లను ఎత్తి 9,493 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 

20 జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్..  

రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఉందని, 20 జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని మంగళవారం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్​ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్​మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. హనుమకొండ, జనగామ, కామారెడ్డి, కుమ్రంభీమ్, మెదక్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్​జారీ చేసింది.