
గచ్చిబౌలి, వెలుగు: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారలు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ సిటీ సర్కిల్‌లోని గచ్చిబౌలిలో ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రాము, సబ్ ఇంజినీర్ సోమనాథ్ లను ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్ మీటర్ వెరిఫై చేయాలని మంగళ్ హట్ సీతారాంపేటకు చెందిన ప్రైవేట్ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సందీప్ కుమార్ కోరాడు.
అధికారులు రూ. 20 వేలు లంచం డిమాండ్ చేయడంతో సందీప్ ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం 3.25 గంటలకు గచ్చిబౌలిలోని ఏడీఈ ఆఫీస్‌లో ఎస్ఈ సోమనాథ్‌కి సందీప్ రూ. 20 వేలు ఇవ్వగా, వాటిని ఎస్ఈ టేబుల్ డ్రా లో పెట్టాడు. వెంటనే ఏసీబీ అధికారులు వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడీఈ సూచన మేరకే లంచం తీసుకున్నట్లు ఎస్ఈ ఒప్పుకోవడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.