
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జులై 29వ తేదీ అర్థరాత్రి 2:30 గంటలకు బుల్దానా జిల్లా మల్కాపూర్ టౌన్‌లోని ఓ ఫ్లైఓవర్‌పై రెండు లగ్జరీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా...మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు.. నాసిక్ వైపుగా వెళుతున్న మరో బస్సును అతి వేగంగా ఢీకొట్టింది. ముందు వెళుతున్న ట్రక్కును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు బస్సులు వేగంగా వెళ్తుండటంతో.. డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ ఏర్పడటంతో.... రాకపోకలకు అంతరాయం కలిగింది.