వరదల్లో చిక్కుకున్న ఇద్దరు..హెలికాప్టర్ తో రెస్క్యూ

వరదల్లో చిక్కుకున్న ఇద్దరు..హెలికాప్టర్ తో రెస్క్యూ

మంచిర్యాల జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ఇద్దరిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) రక్షించింది. చెన్నూర్ మండలం సోమన్ పల్లి వద్ద వరదల్లో చిక్కుకున్న ఇద్దరినీ చేతక్ హెలికాప్టర్ ద్వారా రక్షించారు. ఇద్దరు వ్యక్తులు మేకలు కాసేందుకు వెళ్లగా..తిరిగి వచ్చే సమయంలో వరద ఉధృతి పెరిగింది. దీంతో వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం ఎదురుచూశారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన వైమానిక దళం ఇద్దరినీ సురక్షిత ప్రాంతానికి తరలించింది. 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని గోదావరి తీర గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. వరద చుట్టుముట్టడంతో కోటపల్లి మండలం పాత దేవులవాడ, కొల్లూరు, రావులపల్లె, దేవులవాడ గ్రామాలను ఖాళీ చేయించారు. గ్రామస్తులను పారుపెల్లి, రాంపూర్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలించారు. ముంపు ముంగిట ఉన్న అర్జునగుట్ట, రాపన్పల్లి, లక్ష్మీపూర్, చెన్నూర్ మండలం సుందరశాల, నర్సక్కపేట గ్రామాల్లోని పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్సెట్టిపేట మండలం పోతపల్లి గ్రామాన్ని ఓ పక్క గోదావరి, మరో పక్క అంకత్​పల్లి వాగు వరద చుట్టేయడంతో గ్రామస్తులను సూరారంలోని రైతు వేదికకు తరలించారు.

జైపూర్ మండలంలో..

జైపూర్ మండలం వేలాల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లోని పలు ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. బాధిత కుటుంబాలను  పోలీసులు వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జన్నారం మండలం రోటిగూడ, సుందరయ్యకాలనీ, పుట్టిగూడ గ్రామాల్లోని కుటుంబాలను, ఆశ్రమ స్కూల్ ​స్టూడెంట్లను జన్నారంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోకి షిఫ్ట్ చేశారు. చెన్నూర్ బతుకమ్మ వాగు బ్రిడ్జి కోతకు గురికావడంతో ఫోర్ వీలర్ల రాకపోకలు బంద్ చేశారు. కోటపల్లి మండలం లింగన్నపేట, ఏదులబంధం మధ్య కల్వర్టు, రోడ్డు తెగిపోయి 9 గ్రామాలకు సంబంధాలు కట్ అయ్యాయి. జైపూర్ మండలం టేకుమట్ల బ్రిడ్జి, పెగడపల్లి ఈదులవాగు ఉప్పొంగి అటువైపు నాలుగు రోజుల నుంచి రాకపోకలు  నిలిచిపోయాయి. రసూల్​పల్లి వాగు టెంపరరీ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహించింది. మంచిర్యాల, జైపూర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.