ఉత్తరాఖండ్​లో ఇద్దరు హైదరాబాద్​ యాత్రికులు మృతి

ఉత్తరాఖండ్​లో ఇద్దరు హైదరాబాద్​ యాత్రికులు మృతి
  •  బద్రీనాథ్​ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా విరిగిపడిన కొండచరియలు 
  • మృతదేహాలు ఛిద్రం కావడంతో అక్కడే అంత్యక్రియలు

పద్మారావునగర్, వెలుగు: బద్రీనాథ్​ దైవ దర్శనానికి వెళ్లిన ఇద్దరు హైదరాబాద్​ యాత్రికులు అక్కడ కొండచరియల ధాటికి చనిపోయారు.  గత వారం పద్మారావునగర్​ లోని స్కందగిరికి చెందిన దార సత్యనారాయణ (50), నిర్మల్​ షాహీ (36) తో పాటు మరో ఇద్దరు యాత్రకు బయలుదేరారు. శనివారం ఉదయం ఉత్తరాఖండ్​లో రెండు బైక్​లు అద్దెకు తీసుకున్నారు. బద్రీనాథ్​ ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. తిరిగి వస్తుండగా చమోలీ జిల్లా కర్ణప్రయాగ–గౌచర్​ మధ్యలో బద్రీనాథ్​ నేషనల్  హైవేపై సత్యనారాయణ, నిర్మల్​ షాహీపై అకస్మాత్తుగా కొండచరియలు  విరిగిపడ్డాయి.

 పెద్దపెద్ద బండరాళ్లు పడడంతో ఆ ఇద్దరితో పాటు బైక్​లు కూడా పూర్తిగా డ్యామేజ్​ అయ్యాయి. ఇద్దరి శరీరాలు ఛిద్రమైపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద నుంచి డెడ్​ బాడీలను బయటకు తీశారు. హైదరాబాద్​ లోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇక్కడి వారి కుటుంబ సభ్యులు ఫ్లైట్​ లో ఆదివారం తెల్లవారుజామున హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ఉత్తరాఖండ్​ వెళ్లారు. 

అయితే సత్యనారాయణ, నిర్మల్  షాహీ మృతదేహాలు బాగా డ్యామేజ్​ కావడంతో అక్కడి పోలీసు అధికారుల సూచన మేరకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. వారి మరణవార్త తెలియగానే స్కందగిరిలో సత్యనారాయణ నివాసం ఉండే  అపార్ట్​మెంట్ లో విషాదం నెలకొంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్​ జాబ్  చేస్తుండగా, ఆయన భార్య హేమ కిరాణాకొట్టు నడుపుతోంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.