ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. 32 మంది మృతి

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. 32 మంది మృతి

దక్షిణ ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో 32 మంది మృతి చెందగా మరో 66 మంది గాయపడ్డారు. ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన 460 కిలోమీటర్ల దూరంలో గల సోహాగ్ ప్రావిన్స్‌లోని తహ్తా జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. కొన్ని బోగీలు పూర్తిగా ధ్వంసమవ్వగా.. మరికొన్ని బోగీలు బోల్తా పడ్డాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. బోగీల్లో చిక్కుకున్నవారిని అతికష్టం మీద బయటకు తీస్తున్నారు.

సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే రైళ్లు ఒకే ట్రాక్ మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈజిప్టులో ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. కైరోలో 2002లో ఒక రైలులో మంటలు చెలరేగడంతో 373 మంది మరణించారు. ఫిబ్రవరి 2019లో కైరోలోని ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద ఒక రైలు పట్టాలు తప్పి మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా మరణించారు. అదేవిధంగా గత ఏడాది మార్చిలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో 13 మంది గాయపడ్డారు.