శంషాబాద్ పరిధిలోని బస్టాప్‌‌లోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు మృతి

శంషాబాద్ పరిధిలోని బస్టాప్‌‌లోకి దూసుకెళ్లిన బొలెరో..  ఇద్దరు మహిళలు మృతి

గండిపేట, వెలుగు:  శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బస్టాప్‌‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ఇద్దరు మహిళలను బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. సాతంరాయి గ్రామానికి చెందిన సుమ, సువర్ణ శంషాబాద్ ఏరియాలోని ఫంక్షన్ హాళ్లలో కూరగాయలు కోసే పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సాతంరాయి దగ్గరలోని ఫంక్షన్ హాల్‌‌లో పని ఉందేమో తెలుసుకునేందుకు వచ్చి ఆర్టీసీ బస్టాప్‌‌ వద్ద నిల్చున్నారు. 

అదే సమయంలో కూరగాయలు, మిర్చి లోడ్‌‌తో శంషాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఓవర్​స్పీడ్​తో దూసుకొచ్చింది. ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌‌ టేక్ చేసే క్రమంలో డ్రైవర్ అదుపు తప్పడంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న బస్టాప్‌‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్టాప్‌‌లో ఉన్న సుమ, సువర్ణ వాహనం కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.