వృద్ధులే వీళ్ళ టార్గెట్.. పెళ్లి పేరుతో లక్షల్లో షాపింగ్ చేసి పరార్.. ఖతర్నాక్ లేడీస్ వీళ్ళు.. 

వృద్ధులే వీళ్ళ టార్గెట్.. పెళ్లి పేరుతో లక్షల్లో షాపింగ్ చేసి పరార్.. ఖతర్నాక్ లేడీస్ వీళ్ళు.. 

పెళ్లి అనేది మనిషి జీవితానికి పరిపూర్ణతనిచ్చే అంశం... పెళ్లి కోసం కలలు కనేవాళ్ళు చాలామందే ఉంటారు. యుక్త వయసులో పెళ్లి ఒక కల అయితే... వయసైపోయాక జీవిత భాగస్వామి మరణించినవాళ్లకి పెళ్లి ఒక తోడును తెచ్చిపెట్టే అవసరం అవుతుంది. ఇలాంటోళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు కిలాడీ లేడీస్ పెద్ద స్కెచ్ వేశారు.. పెళ్లి కోసం ట్రై చేస్తున్న వృద్ధులను టార్గెట్ చేసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డారు ఇద్దరు మహిళలు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

ఒంటరిగా ఉంటున్న వృద్ధులను టార్గెట్​చేసుకొని, పెండ్లి సంబంధాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు మహిళలను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కృష్టాజిల్లా తిరువూరుకు చెందిన కటారు తాయారమ్మ అలియాస్​ సరస్వతీ(65), ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కూనపరెడ్డి స్వాతి (40) కలిసి ఓ దినపత్రికలో మ్యారేజ్ బ్యూరో పేరుతో వృద్ధుల కోసమే ప్రత్యేకంగా తప్పుడు ప్రకటనలు ఇచ్చేవారు. వాటిని చూసి ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి ఓ వృద్ధుడు గతేడాది అక్టోబర్​లో వీరిని కాంటాక్ట్ అయ్యాడు. 

తనకు పెండ్లి చేసుకోవాలని ఉందని, అమ్మాయిని చూపించాలని కోరాడు. దీంతో ఒక విడో అమ్మాయి ఉందని చెప్పి, దిల్​సుఖ్​నగర్​లోని గణేశ్ లాడ్జిలో పెండ్లి చూపులు ఆరెంజ్ చేశారు. వృద్ధుడికి అమ్మాయి నచ్చడంతో పెండ్లి షాపింగ్​కోసం సికింద్రాబాద్​లోని ఆర్పీ రోడ్డుకు తీసుకెళ్లి, రూ.1.77 లక్షల షాపింగ్​చేశారు. ఆ డబ్బులను బాధిత వృద్ధుడితోనే కట్టించారు. 

ఆ తర్వాత త్వరలో పెండ్లి పెట్టుకుందామని చెప్పి, పత్తా లేకుండా పోయారు. ఫోన్ నంబర్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో మహంకాళి పోలీసులకు బాధితుడు అదే నెలలో ఫిర్యాదు చేశాడు. అయితే, నిందితుల ఫొటోలు లేకపోవడం, పత్రికలో మ్యారేజ్ బ్యూరో నంబర్లు కూడా ఫేక్​కావడంతో వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.