
ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యి రెండేళ్లు అవుతున్నా పేదలకు కేటాయించడం లేదు. మెయింటనెన్స్ లేక ఇండ్లు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే కొన్ని ఇండ్ల గోడలు నెర్రెలు బారాయి. చాలాచోట్ల డోర్లు విరిగాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో మందుబాబులు వాటిని అడ్డాగా మార్చుకుంటున్నారు. కొందరు నిర్మాణ సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు. విలువైన కరెంట్ వైర్లు, పైపులు కనబడకుండా పోతున్నాయి.
జిల్లా కేంద్రంలో పరిస్థితి అధ్వానం..
డబుల్ ఇండ్లు పంపిణీ చేయాలని పేదలు రోజూ ఆందోళన చేస్తున్నారు. కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.. ఎన్ని నిరసనలు చేసినా, అధికారులను, లీడర్లను ఎన్ని సార్లు కలిసినా ఫలితం ఉండడం లేదు. కేఆర్కే కాలనీలో నిర్మించిన ఇండ్లలో కరెంట్ వైర్ల కోసం గోడలను పగలగొట్టి మరీ దొంగిలించడం గమనార్హం.
ఒక్కటీ పంపిణి చేయలె..
జిల్లా వ్యాప్తంగా 2015-–16 నుంచి విడతల వారీగా మొత్తం 3862 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 2291 ఇండ్లకు టెండర్లు పిలిచారు. ఆరేళ్లలో ఇప్పటి వరకు 606 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పూర్తైన ఇండ్లలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అధికారికంగా పంపిణీ చేయలేదు. దీంతో జైనథ్, మావల మండలంతో పాటు తాంసి మండలం బండల్గ్ నాగాపూర్ లో లబ్ధిదారులు ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జైనథ్ లో డబుల్ బెడ్ రూంలు ఖాళీ చేయాలంటూ అధికారులు పేదలపై ఒత్తిడి తేవడంతో వారంత కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.
పనులు పూర్తియినా.. పంపిణీ లేదు
ప్రస్తుతం 1323 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, తాగునీరు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. 90 శాతం పనులు పూర్తైన ఇండ్లు మెయింటెనెన్స్, రక్షణ లేకపోవడంతో దెబ్బతింటున్నాయి. క్వాలిటీ లేకపోవడంతో పెచ్చులూడటం, పునాది, భీమ్ లు నెర్రలు బారాయి. అయితే ఈ ఏడాది జనవరిలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టి ఇండ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం గతేడాది ఆదేశాలిచ్చింది. కానీ ఇంత వరకు ఒక్క లబ్ధిదారుడిని ఎంపిక చేయలేదు. డబుల్ బెడ్ రూంల కోసం అధికార పార్టీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కిటికీల అద్దాలు పగిలిన ఈ ఫొటో ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇల్లుది. ఇక్కడ 720 ఇండ్లు కట్టి రెండేండ్లు అవుతోంది. కరెంట్, కలర్, పైప్ ఫిట్టింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది. కానీ, ఈ ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో చేసిన పనులు దెబ్బతింటున్నాయి. చాలా ఇండ్ల తలుపులు ధ్వంసం అయ్యాయి. కిటికీల అద్దాలు పగిలిపోయి. కొన్ని ఇండ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. మరికొన్ని చోట్ల పెచ్చులూడి పాత ఇండ్ల లెక్క కనిపిస్తున్నాయి. ఇండ్లు చేతికి అందకముందే ఇలా దెబ్బతినడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని స్థానికులు అంటున్నారు.
ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది..
డబుల్ బెడ్ రూంల లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారికి తప్పకుండా ఎంపిక చేస్తాం. ఇప్పటి వరకు 606 ఇండ్లు పూర్తి చేయడం జరిగింది. ఇంకా వివిద దశల్లో ఉన్న ఇండ్లను త్వరలో పూర్తయ్యేలా చూస్తాం.
- బసవేశ్వర్, నోడల్ అధికారి