Gill vs Patidar: క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న #IPL2026Final పండగ వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ట్రోఫీ కోసం కుస్తీ పట్టబోతున్నాయి. ఇద్దరు యువ కెప్టెన్లు తమ కెరీర్‌ను మలుపు తిప్పుకునే సువర్ణావకాశం ఇది.. గిల్ తన కెప్టెన్సీ సత్తా ఏందో చూపించాలని చూస్తుంటే, పటిదార్ మరోసారి కప్ గెలిచి చరిత్ర సృష్టించాలనే కసితో ఉన్నాడు.
గిల్ కి మూమెంట్ లభిస్తుందా?:
రోహిత్ శర్మ నుంచి టీమిండియా వన్డే, టెస్ట్ పగ్గాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుకున్నప్పటి నుంచి మిశ్రమ ఫలితాలే చూశాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను 2–2తో డ్రా చేసి శబాష్ అనిపించుకున్నా, సొంత గడ్డపై సౌతాఫ్రికా చేతిలో 0–2తో ఓడిపోవడం, టీ20 వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో చాలానే ఇబ్బంది పడ్డాడు. కానీ ఈసారి గుజరాత్ టీమ్‌ను కెప్టెన్‌గా ఫైనల్‌కు తీసుకొచ్చి తనలోని సారథ్య పటిమని నిరూపించాడు.
ఐపీఎల్ 2024 నుంచి గిల్ ఏకంగా 1798 రన్స్ చేసి దూసుకుపోతున్నాడు. వచ్చే ఏడాది జరగబోయే బోర్డర్- గవాస్కర్ సిరీస్, వన్డే వరల్డ్ కప్‌ల కంటే ముందే ఈ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే గిల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా ఆల్-ఫార్మాట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలంటే ఈ గెలుపు గిల్‌కు ‘లైఫ్ లైన్’ లాంటిది.
పాటిదార్ సైలెంట్ కిల్లర్:
ఇంకోవైపు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ తనదైన శైలిలో ‘లెగసీ’ క్రియేట్ చేయడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. రజత్ గ్రౌండ్‌లోకి దిగితే మాత్రం ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు.. క్వాలిఫైయర్ 1లో గుజరాత్ బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తూ కేవలం 33 బంతుల్లో 93 రన్స్ చేసి ఆర్సీబీని ఈజీగా ఫైనల్‌కు చేర్చాడు. ఒకవేళ ఈ రోజు మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలిచిన మూడో కెప్టెన్‌గా పటిదార్ సంచలనం సృష్టిస్తాడు. గతంలో ఎంఎస్ ధోని (CSK), రోహిత్ శర్మ (MI) మాత్రమే ఈ ఫీట్ సాధించారు. మరి ఈ ‘సైలెంట్ కిల్లర్’ వాళ్ల సరసన చేరుతాడా లేదో చూడాలి.
►ALSO READ | ఫైనల్కి ముందు గుజరాత్ టైటాన్స్కి షాక్.. ఆర్సీబీకి లక్కు కలిసొచ్చింది రోయ్
ఆర్సీబీకి లక్.. గుజరాత్‌కు జర్నీ తిప్పలు:
ఈ ఫైనల్ మ్యాచ్ కి ముందు లక్ ఎవరికి ఉందంటే.. ఆర్సీబీకే కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే బుధవారం నుంచే అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయిన బెంగళూరు ప్లేయర్స్, గట్టిగా రెండు ప్రాక్టీస్ సెషన్స్ కొట్టి ఫుల్ రెస్ట్ తీసుకుని మస్త్ ఖుషీగా ఉన్నారు. కానీ గుజరాత్ టైటాన్స్ పరిస్థితి అట్ల లేదు.. అహ్మదాబాద్ టూ ధర్మశాల, అక్కడి నుంచి చండీగఢ్.. మళ్లీ అహ్మదాబాద్.. ప్రయాణాలతోనే సగం సచ్చిపోయారు. పైగా వాతావరణం మూలంగా ఫ్లైట్ లేట్ కావడంతో శనివారం అర్ధరాత్రి దాటాక హోటల్‌కు చేరి తీవ్రంగా అలసిపోయారు.
ఆవా దే నా? ఈ సాల కప్ నమ్దే నా?:
ఫైనల్ ఫైట్‌కు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఒకరు తన కెప్టెన్సీ సత్తా ఏందో లోకానికి చాటాలని చూస్తుంటే.. మరొకరు రికార్డుల రారాజుల సరసన చేరాలని స్కెచ్ వేశారు. మరి ఈ రాత్రికి మోడీ స్టేడియంలో వినిపించే స్లోగన్ గుజరాత్ వాళ్ల 'ఆవా దే' (రానివ్వండి చూసుకుందాం) నా? లేక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇన్నేళ్ల కలల నినాదం 'ఈ సాల కప్ నమ్దే' (ఈసారి కప్పు మనదే) నా? కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. గెలిచేది ఎవరో గానీ.. మ్యాచ్ మాత్రం గూస్‌బంప్స్ తెప్పించడం గ్యారంటీ..
