- సీజ్‌ఫైర్‌ను ఇరాన్ ఉల్లంఘించిందన్న యూఎస్
- శత్రు దేశ అటాక్‌ను తిప్పికొట్టామని వెల్లడి
దుబాయ్:ఇరాన్ తమపై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్ చేసిందని యూఏఈ పేర్కొంది. అయితే, ఈ దాడిలో జరిగిన డ్యామేజీ గురించి వివరాలు తెలియరాలేదు. మరోవైపు హార్మూజ్ జలసంధిలో తమ మూడు షిప్పులపైనా ఇరాన్ దాడికి యత్నించిందని అమెరికా తెలిపింది. ఇరాన్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నామని యూఎస్ తెలిపింది. సీజ్ ఫైర్ నిబంధనలను ఇరాన్ ఉల్లంఘించిందని విమర్శించింది. కాగా.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని ఇరాన్ తెలిపింది.
అలాగే ఇరాన్, అమెరికా మధ్య త్వరలో డీల్ కుదురుతుందని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. శుక్రవారం వాషింగ్టన్ లో రిపోర్టర్లతో ఆయన మాట్లాడారు. తమ డీల్ కు ఒప్పుకోకపోతే మాత్రం ఇరాన్ కు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. ‘‘డీల్ గురించి ఇరాన్ అర్థం చేసుకోవాలి. డీల్ పై సంతకం పెట్టకపోతే, వారు (ఇరాన్) చాలా బాధపడాల్సి వస్తుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు.
కాగా.. హార్మూజ్ జలసంధిలో తమ బలగాలపై అమెరికా దాడులు చేస్తున్నదని, ఆ దాడులను తమ బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అలాగే, గురువారం రాత్రి వెస్టర్న్ టెహ్రాన్ పైనా భారీ శబ్దాలు వినిపించాయని తెలిపింది.
చైనా ఆయిల్ ట్యాంకర్‌పై దాడి
హార్మూజ్ జలసంధిలో చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ దాడికి గురైంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి చైనా ట్యాంకర్ దాడికి గురవడం ఇదే మొదటిసారి. ఈ దాడిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. మార్షల్ ఐలాండ్స్ తో ఆ ట్యాంకర్ రిజిస్టర్ అయిందని, దాడి జరిగినపుడు చైనా సిబ్బంది ఆ ట్యాంకర్లో ఉన్నారని చెప్పారు. అయితే, ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
