భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్‌‌‌‌‌‌ కార్పొరేట్ ఆఫీస్..ప్రకటించిన  సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి

భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్‌‌‌‌‌‌ కార్పొరేట్ ఆఫీస్..ప్రకటించిన  సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి
  • సీఎం రేవంత్‌‌తో  భేటీ.. తెలంగాణలో భారీగా పెట్టుబడులకు ఆసక్తి
  • మెట్రో స్టేషన్ల వద్ద మల్టీలెవల్ పార్కింగ్ పై ప్రతినిధుల ఆసక్తి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటుకు ఉబర్​ సిద్ధమని ప్రకటించింది. నగరంలో కీలకమైన తన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యకలాపాలను భారీగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని టీమ్​ భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై చర్చలు జరిపారు. తెలంగాణలో ఉబర్ కంపెనీ వ్యాపార కార్యకలాపాలను ఖోస్రోషాహి వివరించారు.

హైదరాబాద్‌‌లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌ను విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందువల్ల మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు పై దృష్టి సారించాలని ఉబర్ ప్రతినిధులకు సూచించారు. మెట్రో స్టేషన్ల దగ్గర తగిన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. సీఎం సూచనపై తప్పకుండా ఆలోచిస్తామని ఉబర్ ప్రతినిధి బృందం తెలిపింది. 

500 కంపెనీలను ఫ్యూచర్​సిటీకి ఆహ్వానిస్తున్నం.. 

హైదరాబాద్‌‌కు సమీపంలో 30 వేల ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్​ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైందని ఉబర్​ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం ముందుకు వచ్చాయన్నారు. గత డిసెంబర్‌‌లో ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌‌లో 100కు పైగా కంపెనీలు పాల్గొని పెట్టుబడులకు ముందుకు వచ్చాయన్నారు. కాగా, సమావేశంలో ఉబర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఉబెర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌‌జీత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.