కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతపులుల్లో ఓ చిరుత మృతి చెందింది.  మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కు లో ఉదయ్ అనే  మగ చిరుత చనిపోయింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఏప్రిల్ 23వ తేదీన సాయంత్రం మరణించినట్లు మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫార్జెస్ట్ జేఎస్ చౌహాన్ వెల్లడించారు. ఏప్రిల్ 23వ తేదీన పొద్దున చిరుత అస్వస్థతకు గురికావడంతో వెంటనే  చికిత్స చేశారు. అయితే అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో ఉదయ్  సాయంత్రం 4  గంటలకు చనిపోయింది. 

ఇది రెండోది..

మద్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో  నెల రోజుల వ్యవధిలో రెండు  చిరుతలు మరణించడం గమనార్హం.  నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మొత్తం 20 చిరుతలు కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. ఇందులో  ఆడ చిరుత సాషా, మగ చిరుత ఉదయ్  మరణించాయి. పార్కులో ప్రస్తుతం  18 చిరుతలు ఉన్నాయి. ఉదయ్ చిరుతకు పోస్టుమార్టం నిర్వహించారు. 

భారత్ లో  చిరుతల సంఖ్యను పెంచే లక్ష్యంతో కేంద్రం  ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా 20 చిరుతలను  తీసుకొచ్చింది. తొలి విడతలో నమీబియా నుంచి 8 చిరుతలు భారత్ కు వచ్చాయి.  వాటిని మధ్యప్రదేశ్ రాష్ట్రం కునో నేషనల్ పార్కులోని ఎన్‌క్లోజర్‌లోకి ప్రధాని నరేంద్ర మోడీ  వదిలారు. ఆ తర్వాత రెండో విడతలో  దక్షిణాఫ్రికా నుంచి 12  చిరుతలు వచ్చాయి. వాటిలో ఐదు ఆడ చిరుతలు.  మొత్తం 20 చిరుతలు కునో నేషనల్ పార్కు‌కు‌రాగా వాటికి పేర్లుసైతం పెట్టారు.

మార్చి నెలలో లో నమీబియా నుంచి తీసుకొచ్చిన సాషా అనే ఆడ చిరుత అనారోగ్యంతో చనిపోయింది.  కిడ్నీలో ఇన్‌ఫెక్షన్ కారణంగా చిరుత మృతి చెందినట్లు కునో నేషనల్ పార్కు అధికారులు వెల్లడించారు. అయితే నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన చిరుతలు ఇక్కడ వాతావరణానికి అలవాటు పడకనే అనారోగ్యానికి గురవుతున్నాయని తెలుస్తోంది.