ఎమ్మెల్సీకి ఉద్ధవ్ థాక్రే నామినేషన్…ఎన్నిక లాంఛనమే

ఎమ్మెల్సీకి ఉద్ధవ్ థాక్రే  నామినేషన్…ఎన్నిక లాంఛనమే

ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. 6 నెలల క్రితమే సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ నెలాఖరు వరకు అటు ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో ఎన్నిక కావాల్సి ఉంది. ఐతే కరోనా ఎఫెక్ట్ తో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడటంతో ఉద్ధవ్ ను ఎమ్మెల్సీ గా నామినేట్ చేయాలని గవర్నర్ ను మహా కేబినెట్ కోరింది. గవర్నర్ స్పందించకపోవటంతో ఉద్ధవ్ థాక్రే స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసి సమస్యను వివరించారు. ఈ పరిణామం తర్వాత ఎన్నికల సంఘం ఈ నెలలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఉద్ధవ్ థాక్రేకు లైన్ క్లియర్ అయ్యింది. మొత్తం 9 ఎమ్మెల్సీ ఎన్నికలకు గానూ బీజేపీ 4, శివసేన, ఎన్సీపీ 2 చొప్పున, కాంగ్రెస్ 1 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ రెండు స్థానాల్లో అభ్యర్థులను పోటీలో పెడతామని ముందుగా ప్రకటించటంతో శివసేన ఆందోళన చెందింది. అదే జరిగితే ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ అనివార్యమయ్యేది. ఐతే కాంగ్రెస్ వెనక్కి తగ్గి ఒకే స్థానానికి పోటీ చేస్తామని తెలుపుటంతో ఇక ఉద్ధవ్ థాక్రే ఎమ్మెల్సీగా ఎన్నికవటం లాంఛనమే.