శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే బహిష్కరణ

శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే బహిష్కరణ

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు..వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు ఆయన్ను శివసేన నుంచి తొలగిస్తున్నట్లు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.  ఈ మేరకు అధికారిక స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు.  శివసేనకు సంబంధించిన అన్ని పదవుల నుంచి ఏక్ నాథ్ షిండేను తొలగిస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే వెల్లడించారు.  షిండే శివసేన పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నాడని..ఇందులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్టేట్మెంట్లో పేర్కొన్నారు.

బీజేపీ సహకారంతో మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్ నాథ్ షిండే  జూన్ 30న  ప్రమాణ స్వీకారం చేశారు.  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షిండే, థానే జిల్లాలో తన రాజకీయ గురువు, దివంగత శివసేన నాయకులు బాల్ థాకరే, ఆనంద్ డిఘేలకు నివాళులర్పించి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సౌత్ ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ షిండే చేత ప్రమాణం చేయించారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సోమవారం(జులై 4)న అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.  

శివసేనలో ఏక్ నాథ్ షిండే ప్రస్థానం..
ఏక్ నాథ్ షిండే పూర్తి పేరు ఏక్ నాథ్ శంభాజి షిండే. ఆయన సతారా జిల్లాలోని జావాలి తాలూకాకు చెందిన వ్యక్తి.  మరాఠా కమ్యూనిటీలో ఆయన బలమైన నేతగా పేరు పొందారు. షిండే  చిన్న తనంలోని ఆయన కుటుంబం  ముంబై శివార్లలోని థానేకు వలస వచ్చింది. మంగళ హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో చదువుకున్న షిండే... శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే, పార్టీ థానే జిల్లా ఇంఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లలో సాధారణ కార్యకర్తగా శివసేనలో చేరారు. అప్పట్లో రిక్షా తొక్కుతూ, ఆటో  నడుపుతూ జీవనం సాగించేవారు. 1984లో పార్టీ కిసాన్ నగర్ బ్రాంచ్ హెడ్గా నియమించబడ్డారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్​ కార్పొరేటర్ గా షిండే ఎన్నికయ్యారు. మొట్టమొదటి సారిగా2004లో థానే నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2005లో థానే జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2019లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. తాజాగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు.