డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!

తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్  కేబినెట్ లో మంత్రిగా ఉన్న  ఉదయనిధి స్టాలిన్  త్వరలో డిప్యూటీ సీఎంగా ప్రమోట్ కానున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.  సీఎం స్టాలిన్ ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారని ఆ లోపే డిప్యూటీ సీఎంగా  ఉదయనిధి స్టాలిన్ కు బాధ్యతలు అప్పగిస్తారని ఆ వార్తల సారంశం.  

2024 జనవరి 21న సేలంలో జరగనున్న పార్టీ యూత్ వింగ్ సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ వార్తలపై డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ టికెఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ ఆ వార్తలను కొట్టిపారేయలేమని.. కానీ తుదినిర్ణయం మాత్రం సీఎం స్టాలిన్ దే అన్నారు.  2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  

ఉదయనిధికి  డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించడం మంచిదని సీఎం స్టాలిన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే దీనిపై పార్టీలోని పలువురు కీలక నేతలతో  సీఎం స్టాలిన్ చర్చించినట్లు సమాచారం.   భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా తన తరువాత ఉదయనిధేనన్న భావన పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు కూడా వెళ్లాలనేది స్టాలిన్‌ యోచనగా ఉన్నట్లు సమాచారం.  

ఇటీవలే ప్రధాని మోదీతో ఉదయనిధి ఒంటరిగానే భేటీ అయ్యారు.  పార్లమెంటు ఎన్నికల కోసం తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ఉదయనిధి సిద్ధమవుతున్నారు.