మెహిదీపట్నం, వెలుగు: యూనిక్ డిజేబుల్ (యూడీ) ఐడీ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదని, అది దివ్యాంగుల గౌరవానికి ప్రతీకగా నిలిచే హక్కు పత్రమని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం నిలోఫర్ ఆసుపత్రిలో యూడీఐడీ ఎవాల్యూషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
వైకల్యాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ప్రభుత్వం రూ. 20 కోట్లతో ఆధునిక పరికరాలను కొనుగోలు చేసిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 13 కేంద్రాలు ఉండగా, త్వరలోనే మరో 7 కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆటిజమ్ బాధితుల కోసం రూ. 10 లక్షలతో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేశామని, చిన్నతనంలోనే వైకల్యాన్ని గుర్తిస్తే థెరపీ ద్వారా నయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
యూడీఐడీ పోర్టల్ ద్వారా 21 రకాల వైకల్యాలను ధృవీకరిస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో 74 వేల కార్డులు జారీ చేశామని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈఆర్‌పీ సీఈవో దివ్య దేవరాజన్, ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు.

