దేశంలోనే అందమైన అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేయండి: తుర్కియేకు ఉగాండా సైన్యాధిపతి హుకుం

దేశంలోనే అందమైన అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేయండి: తుర్కియేకు ఉగాండా సైన్యాధిపతి హుకుం
  • బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించండి


కంపాలా: ఉగాండా సైన్యాధిపతి ముహూజీ కైనెరుగాబా మరోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో శాంతిభద్రతలు కాపాడటానికి ఉగాండా అందిస్తున్న సేవలకు గాను తుర్కియే ప్రభుత్వం  బిలియన్ డాలర్ల (రూ.9,300 కోట్లు) పరిహారం చెల్లించాలని  కోరారు. తుర్కియేలోని అత్యంత అందమైన అమ్మాయిని ఇచ్చి తనకు పెండ్లి చేయాలని డిమాండ్ చేశారు. 30 రోజుల్లోగా ఈ డిమాండ్లను నెరవేర్చకుంటే తుర్కియే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

తుర్కియేతో దౌత్య సంబంధాలు తెంచుకుంటాని, కంపాలాలోని ఆ దేశ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా ఉగాండా ప్రజలు తుర్కియే పర్యటనలు మానుకోవాలని సూచించారు. సోమాలియాలో శాంతి భద్రతలను కాపాడటానికి ఉగాండా దశాబ్దాలుగా పోరాడుతుంటే, తుర్కియే మాత్రం అక్కడి ఓడరేవులు, విమానాశ్రయాల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ లాభాలు గడిస్తున్నదని ఆరోపించారు. 

గతంలో కూడా ముహూజీ ఇలాంటి వింత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 2022లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని పెండ్లి చేసుకుంటానని, అందుకు ప్రతిఫలంగా100 అంకోల్ ఆవులను ఇటలీకి బహుమతిగా  ఇస్తానని ప్రకటించి అప్పట్లో దుమారం రేపారు. తుర్కియేను విమర్శిస్తూనే, మరోవైపు ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లక్ష మంది ఉగాండా సైనికులను ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌కు పంపుతానని పేర్కొన్నారు. ముహూజీ కైనెరుగాబా వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఉగాండా అధ్యక్షుడు, ఆయన తండ్రి యోవేరి ముసెవేని బహిరంగ క్షమాపణలు చెప్పారు.