- ముగిసిన రష్యా, ఉక్రెయిన్ అధికారుల మొదటి రౌండ్ భేటీ
- ఏమీ తేల్చకుండానే వెనుదిరిగిన ప్రతినిధులు
- పోలాండ్- బెలారస్ బార్డర్ లో రెండో రౌండ్ కు నిర్ణయం
- రష్యా వెనక్కి వెళ్లాల్సిందేనని ఉక్రెయిన్ పట్టు
- ఉక్రెయిన్ ఈయూలో చేరొద్దని రష్యా డిమాండ్
- ఐదోరోజూ సిటీల్లో కొనసాగిన యుద్ధం
- తీవ్రంగా ప్రతిఘటించిన ఉక్రెయిన్ బలగాలు
- రష్యా దాడులపై యూఎన్ జనరల్ అసెంబ్లీ భేటీ
కీవ్/మాస్కో: ఉక్రెయిన్ లో ఒక పక్క బాంబుల మోత మోగుతుండగానే.. మరో పక్క బెలారస్ బార్డర్ లో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు షురువయ్యాయి. బెలారస్ విదేశాంగ మంత్రి వ్లాదిమిర్ మకేయి ఆధ్వర్యంలో సోమవారం చెర్నోబిల్ ఎక్స్ క్లూజన్ జోన్ కు సమీపంలో బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎలాంటి షరతులు లేకుండానే చర్చలు జరుపుతామని తొలుత ప్రకటన వచ్చినా.. చర్చలకు వెళ్లడానికి ముందే రెండు దేశాలు తమ తమ డిమాండ్లను ప్రకటించాయి. ఉక్రెయిన్ ను వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేర్చుకోవాలని, రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, బలగాలను వెనక్కి తీస్కోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. ఈయూలో చేరబోమని ఉక్రెయిన్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని రష్యా డిమాండ్ చేసింది. అయితే, ఏమీ తేలకుండానే రెండు దేశాల మధ్య ఫస్ట్ రౌండ్ చర్చలు ముగిశాయని సోమవారం రాత్రి రష్యన్ మీడియా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. రెండు దేశాల ప్రతినిధులు తమ రాజధానులకు తిరిగి వెళ్లారని, తమ తమ ప్రభుత్వాలతో సంప్రదింపుల తర్వాత పోలాండ్– బెలారస్ బార్డర్ లో రెండో రౌండ్ చర్చలు ఉంటాయని తెలిపింది.
‘ఈయూ’ అప్లికేషన్ పై జెలెన్ స్కీ దస్కత్
ఉక్రెయిన్ కు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం కోసం సోమవారం ఆ దేశ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ అప్లికేషన్ పై సంతకం చేశారు. తమను వెంటనే ఈయూలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘‘యూరోపియన్ లతో కలిసి ఉండాలన్నదే మా లక్ష్యం. మేం అందరితో సమానంగా ఉండాలి. అందుకు మాకు తగిన అర్హత ఉందని భావిస్తున్నాం” అని సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో
జెలెన్ స్కీ చెప్పారు.
వరుసగా ఐదో రోజు కూడా రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య పోరాటం కొనసాగింది. ఉక్రెయిన్ లోని సిటీలను చేజిక్కించుకోవడం కోసం రష్యన్ బలగాలు బాంబు దాడులు కొనసాగించాయి. అయితే, సోమవారం రష్యన్ బలగాల దూకుడు తగ్గినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. దేశ రాజధాని కీవ్ తో పాటు ఇతర కీలక సిటీల్లో ఉక్రేనియన్లు ప్రతిఘటన కొనసాగించినట్లు తెలిపింది. ఇక కీవ్ సిటీలో తెల్లవారుజామున కూడా భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఈశాన్యంలోని ఖార్కివ్ సిటీపై రష్యన్ బలగాలు జరిపిన రాకెట్ దాడుల్లో అనేక మంది మృతిచెందినట్లు ఉక్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. అయితే, కీలకమైన సిటీలు రష్యన్ సోల్జర్ల చేతికి చిక్కకుండా ఉక్రెయిన్ బలగాలు తిప్పికొడుతున్నాయి. కీవ్ కు ఈశాన్యంలో ఉన్న చెర్నిహివ్ సిటీపై, డోనెట్స్క్ రీజియన్ లోని కొన్ని ప్రాంతాలపై రష్యన్ బలగాలు ఫోకస్ పెట్టాయని ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ లోని ఆగ్నేయ ప్రాంతంలో జపోరిజ్ జ్యా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా ఉన్న బెర్డియాన్స్క్, ఇనెర్ హాడర్ సిటీలను తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా ప్రకటించింది. న్యూక్లియర్ ప్లాంటు ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయని ఇంటర్ ఫ్యాక్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఈ న్యూక్లియర్ ప్లాంటు రష్యన్ సోల్జర్ల చేతికి వెళ్లలేదని, అది తమ కంట్రోల్ లోనే ఉందని ఉక్రెయిన్ చెప్పినట్లు పేర్కొంది. కాగా, కీవ్ సిటీ నుంచి ప్రజలు బయటకు వెళ్లిపోవాలని, వాళ్లకు సేఫ్కారిడార్ ఏర్పాటు చేస్తామని రష్యన్ బలగాలు పిలుపునిచ్చాయి.
352 మంది ఉక్రేనియన్లు మృతి
రష్యా దాడుల్లో 14 మంది చిన్నారులు సహా 352 మంది ఉక్రేనియన్లు మృతి చెందారని, మరో 1,684 మంది గాయపడ్డారని సోమవారం ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాయపడిన వారిలో 116 మంది పిల్లలు ఉన్నారని తెలిపింది. అయితే, ఉక్రెయిన్ లో ఏడుగురు చిన్నారులతో సహా102 మంది పౌరులు చనిపోయారని, 304 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ చీఫ్ మిచెల్ బాచ్ లెట్ వెల్లడించారు. వాస్తవానికి మృతుల సంఖ్య మరింత భారీగా ఉండొచ్చని తెలిపారు. బాంబు పేలుళ్లు, మోర్టార్ షెల్స్, ఆర్టిలరీ, రాకెట్, మిసైల్ దాడుల కారణంగానే చాలా మంది చనిపోయారని పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ నుంచి 5 లక్షల మందికిపైగా ప్రజలు పక్క దేశాలకు వలస పోయారని ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది.
నాటో దేశాల నుంచి వెపన్స్
ఉక్రెయిన్ కు నాటో దేశాల నుంచి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లు, యాంటీ ట్యాంక్ వెపన్స్, ఇతర ఆయుధాలు అందనున్నాయని నాటో చీఫ్స్టోల్టెన్ బర్గ్ వెల్లడించారు. యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు వెపన్స్ అందిస్తూ తమ పట్ల శత్రువుల్లా ప్రవర్తిస్తున్నాయని, ఉక్రెయిన్ ను డీమిలిటరైజ్ చేయాలన్న తమ ప్రయత్నం సరైనదేనని చెప్పకనే చెప్తున్నాయని రష్యా కామెంట్ చేసింది. కాగా, ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచీ రష్యా 350 మిసైల్స్ ను ప్రయోగించిందని అమెరికా డిఫెన్స్ అధికారి ఒకరు చెప్పారు. వీటిలో కొన్ని మిసైల్స్ ప్రజల ఇండ్లు, ఆస్తులను ధ్వంసం చేశాయన్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రత్యేక భేటీ
ఉక్రెయిన్ పై రష్యా దాడులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సోమవారం అత్యవసరంగా ప్రత్యేక సమావేశం ప్రారంభించింది. జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షాహిద్ అధ్యక్షతన సమావేశమైన 193 మెంబర్ కంట్రీస్ ప్రతినిధులు ముందుగా ఉక్రెయిన్ వార్ లో మృతులకు సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించారు. ఇలా అత్యంత అరుదైన ప్రత్యేక సమావేశం నిర్వహించడం ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఇది 11వ సారి మాత్రమే. ‘రష్యా ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే దాడికి దిగింది. వెంటనే కాల్పుల విరమణ పాటించాలి’ అంటూ ప్రవేశపెట్టిన తీర్మానంపై జనరల్ అసెంబ్లీలో 100కు పైగా దేశాల ప్రతినిధులు మాట్లాడే అవకాశం ఉంది. సమావేశంలో మొదట యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లో యుద్ధం ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. జరిగిందేదో జరిగిందని, నేతలు శాంతికి ప్రయత్నించాలని, ప్రజలను కాపాడాలన్నారు. న్యూక్లియర్ బలగాలను హైఅలర్ట్ లో ఉంచామన్న పుతిన్ ప్రకటనపై మండిపడ్డారు. ఇది భయంకరమైన పరిణామమని, అణ్వస్త్రాల వాడకం ఏ విధంగా సమర్థనీయం కాదన్నారు. కాగా, ఈ తీర్మానంపై మంగళవారం నాడు ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓటింగ్ కు ఇండియా, సిరియా, చైనా, క్యూబా దేశాలు దూరంగా ఉండొచ్చని, రష్యాకు వ్యతిరేకంగా 100కు పైగా ఓట్లు రావచ్చని
భావిస్తున్నారు.
రష్యాకు ఇంటా, బయటా నిరసనలు
ఉక్రెయిన్ పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ రష్యాతో సహా అనేక దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాలో గురువారం నుంచే 6 వేల మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక జర్మనీ, జపాన్, బ్రిటన్, తదితర దేశాల్లోని సిటీల్లోనూ వేలాది మంది రష్యాకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్నారు.
యుద్ధ రంగంలోకి బెలారస్?
చర్చల ఫలితాలను బట్టి రష్యాకు మద్దతుగా బెలారస్ కూడా యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. అయితే రష్యా అనుకున్నంత ఈజీగా ఉక్రెయిన్‌పై ఆధిపత్యం సాధించలేక పోతోందని అమెరికన్ ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. రష్యన్ బలగాలు కీవ్ కు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో గుమిగూడాయని, సిటీలోకి ఎంటర్ కాకుండా ఉక్రెయిన్ సోల్జర్లు అడ్డుకుంటు న్నారని బ్రిటన్ రక్షణ శాఖ పేర్కొంది.
ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్లకు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ
హైదరాబాద్, వెలుగు: ఉక్రెయిన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న స్టూడెంట్లకు టీఎస్ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయొచ్చని సంస్థ తెలిపింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాష్ట్రంలోని ఎక్కడికైనా ప్రయాణించొచ్చని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
