కీవ్: ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ విమానాలపై పడింది. అన్ని దిక్కుల నుంచీ రష్యా బాంబులతో విరుచుకుపడుతుండడంతో.. అన్ని దేశాల ఎయిర్‌లైన్స్ విమానాలను బంద్పెట్టాయి.దాడి చేస్తున్నట్టు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించగానే.. తమ ఎయిర్‌స్పేస్‌ను మూసేస్తున్నట్టు ఉక్రెయిన్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు సరిహద్దుల్లోని రోస్తోవ్ ఎయిర్‌స్పేస్‌ను మూసేస్తున్నట్టు రష్యా ప్రకటించింది. రోస్తోవాన్ డాన్, క్రాశ్నోడార్, స్తావ్రోపోల్ ఎయిర్‌పోర్టులను మార్చి 2 దాకా క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించింది. బెలారస్ కూడా ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. రష్యా, బెలారస్‌తో పాటు ఉక్రెయిన్ సరిహద్దులకు చుట్టుపక్కల 100 నాటికల్ మైళ్ల వరకున్న ఎయిర్‌స్పేస్ అంత సేఫ్ కాదని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) అలర్ట్ జారీ చేసింది.
ఆ దారిలో విమానాలు వెళ్తే కావాలని లేదా పొరపాటున కూల్చేసే ముప్పుందని హెచ్చరించింది. ఉక్రెయిన్, క్రిమియా మీదుగా వెళ్లొద్దంటూ అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీలు కూడా తమ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలిచ్చాయి. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ దాకా వెళ్లిన కొన్ని విమానాలు.. గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటన రాగానే వెనక్కు మళ్లాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ నుంచి టొరంటోకు బయల్దేరిన ఎల్అల్ విమానం, వార్సా నుంచి కీవ్‌కు వెళ్తున్న పోలండ్ లాట్ ఎయిర్‌లైన్స్ విమానం వెనక్కు వచ్చేశాయి. జర్మనీకి చెందిన లుఫ్త్హాన్సా, కేఎల్ఎం ఎయిర్‌లైన్స్ సోమవారం నుంచి సర్వీసులను బంద్పెట్టాయి. ఉక్రెయిన్‌లోని రెండు ఎయిర్‌లైన్స్ సంస్థలు గతవారమే సర్వీసులను నిలిపేశాయి.
ఎంహెచ్17 కూల్చివేతతో అలర్ట్
క్రిమియాను రష్యాలో కలిపేసుకునే సందర్భంలో 2014లోనూ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ఆ టైంలోనే ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ నుంచి వెళ్తున్న మలేసియా విమానం ఎంహెచ్17ను ఉక్రెయిన్ బలగాలు కూల్చేశాయి. ఆ ఘటనలో వందలాది మంది చనిపోయారు. అప్పట్నుంచి యుద్ధ భయాలున్న ప్రాంతాల నుంచి విమానాలను దారి మళ్లించడం, వాటిని అలర్ట్ చేయడం కోసం ‘సేఫ్ ఎయిర్‌స్పేస్’ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ అంత సేఫ్ కాదని సేఫ్ ఎయిర్‌స్పేస్ ప్రకటించింది.
వాపస్ వచ్చిన ఎయిరిండియా ఫ్లైట్
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు గురువారం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనక్కి వచ్చేసింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడంతో ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. దీంతో ఫ్లైట్ వెనక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మనోళ్లను స్వదేశానికి తీసుకురావడానికి వెళ్లిన ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లీంది. ఉక్రెయిన్‌కు వెళ్లే అన్ని విమానాలకు నోటామ్ లేదా ఎయిర్‌మెన్‌లకు నోటీసు పంపిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి వచ్చింది.
