ఉక్రెయిన్లో మాల్పై మిసైల్​ దాడి

ఉక్రెయిన్లో మాల్పై మిసైల్​ దాడి

 

  • క్రెమెన్​చుక్ లక్ష్యంగా రష్యా ఎటాక్
  • మాల్లో వెయ్యి మందికి పైగా జనం
  • ప్రాణ నష్టం ఊహించలేకపోతున్నాం:  ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​స్కీ

కీవ్​: ఉక్రెయిన్​పై రష్యా మిసైల్స్​తో విరుచుకుపడుతూనే ఉంది. జనావాసాలను కూడా లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేస్తోంది. సోమవారం క్రెమెన్​చుక్​ నగరంలోని ఓ షాపింగ్ మాల్​పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఎటాక్​ చేసిన సమయంలో మాల్​లో సుమారు వెయ్యి మందికి పైగా ఉన్నారు. దీంతో ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్ స్కీ టెలిగ్రామ్​ వేదికగా రష్యాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. షాపింగ్​ మాల్​పై దాడి ఊహించలేమని, మృతులు, క్షతగాత్రులు ఎంత మంది ఉంటారో కూడా చెప్పలేమని తెలిపారు.

ఓ అంచనాకు రావడం కూడా కష్టమే అని చెప్పారు. మానవతా దృక్పథంతో రష్యా వ్యవహరిస్తుందని ఆశలు పెట్టుకోవడం కూడా వేస్ట్​ అని మండిపడ్డారు. క్రెమెన్​చుక్​లోని కిక్కిరిసి ఉన్న షాపింగ్​మాల్​పై రష్యా మిసైల్​ ఎటాక్ చేసిందని మేయర్​ విటలీయ్​ మెలెటస్కీ ప్రకటించారు. క్రెమెన్​చుక్ ఇండస్ర్టియల్​ సిటీ. రష్యాతో యుద్ధానికి ముందు ఇక్కడ 2,17,000 మంది ప్రజలు నివసించేవారు. ఉక్రెయిన్​లోనే అతిపెద్ద ఆయిల్​ రిఫైనరీ ఇక్కడే ఉంది. 

రష్యా నెక్స్ట్ టార్గెట్​ లుహాన్స్క్ 

తూర్పు లుహాన్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్​ ఆర్మీ ప్రయత్నిస్తోందని గవర్నర్​ సెర్హి హైదాయ్ తెలిపారు. లైసిచాన్స్క్​ నగరంపై దాడి ముమ్మరం చేసిందన్నారు. కీవ్​లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు వెస్ట్రన్​ దేశాల​ లీడర్లు సోమవారం సమావేశం అయ్యారన్నారు. కొన్ని రోజుల కింద సీవీరోడోనెట్స్క్​ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు, పక్కనే ఉన్న లైసిచాన్స్క్​పై కన్నేశారని తెలిపారు. మిసైల్స్​, బాంబులతో విరుచుకుపడుతున్నారని సెర్హి హైదాయ్ వివరించారు.

డాన్​బాస్​ రీజియన్​ను స్వాధీనం చేసుకోవడం రష్యా బలగాల ప్రధాన లక్ష్యమన్నారు. నగరం దక్షిణ భాగాన్ని రష్యా ఆర్మీ బ్లాక్​ చేస్తోందని, రాకెట్​ లాంచర్లు, ఆయుధాలు తరలించేందుకు అడ్డొచ్చిన ప్రతీ గ్రామంపై దాడికి దిగుతోందని వివరించారు. 24 గంటల్లో కీవ్​తో పాటు ఉక్రెయిన్​లోని పలు ప్రాంతాలపై రష్యా బలగాలు జరిపిన దాడుల్లో ఆరుగురు పౌరులు చనిపోగా.. 31 మంది గాయపడ్డారని జెలెన్​స్కీ కార్యాలయం ప్రకటించింది.