ఉక్రెయిన్, రష్యా సేనల మధ్య భీకర పోరాటం

ఉక్రెయిన్, రష్యా సేనల మధ్య భీకర పోరాటం

కీవ్: రాజధాని కీవ్​లోని కీలకమైన ప్రాంతాన్ని మళ్లీ తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు ఉక్రెయిన్​ మంగళవారం ప్రకటించింది. తెల్లవారుజామున కీవ్​ సబర్బ్​ మకరీవ్​లో ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. తమ బలగాలు రష్యన్లను తరిమి కొట్టాయని ఉక్రెయిన్​ రక్షణ శాఖ వెల్లడించింది. దీంతో కీలకమైన ఒక హైవేపై ఉక్రెయినియన్లకు పట్టు చిక్కింది. దీని ద్వారా రష్యా బలగాలు రాకపోకలు సాగించకుండా అడ్డుకునే అవకాశం దక్కింది. అయితే కీవ్​లోని కీలక ప్రాంతాలైన బుచ్చా, హోస్టోమెల్, ఇర్పిన్ తదితర ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా రష్యన్​ బలగాల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. కీవ్​కు సమీపంలోని ప్రాంతాల్లోనూ రష్యా బలగాల పట్టు కొనసాగుతోంది. మరియుపోల్​పై కంట్రోల్​ కోసం పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ పోర్ట్​ సిటీపై పట్టు సాధించేందుకు రష్యన్లు అన్ని వైపుల నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో నగరంలో ఎటుచూసినా శిథిల భవనాలు, శవాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. పేలుళ్లు, తుపాకీగుళ్ల శబ్ధాలే వినిపిస్తున్నాయి. బూడిద, పొగ ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. మరోవైపు కీవ్​లో బుధవారం ఉదయం వరకు 35 గంటల కర్ఫ్యూ విధించారు. స్థానికులు ఇండ్లు, అండర్​గ్రౌండ్​లో తలదాచుకుంటున్నారు. ఇక సరెండర్​ కావాలన్న డిమాండ్లకు మరియుపోల్​అధికారులు అంగీకరించకపోవడంతో అక్కడ దాడుల తీవ్రతను పెంచింది రష్యన్​ మిలిటరీ. రష్యన్​ బలగాలు ఎక్కువగా ఎయిర్​ఫోర్స్, ఆర్టిలరీలపైనే ఆధారపడుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 35 లక్షల మంది ఉక్రెయిన్​ నుంచి పొరుగు దేశాలకు చేరుకున్నారు. మరోవైపు ఉక్రెయిన్​లో రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి న్యూట్రల్​గా ఉంటున్న ఇండియాపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్​ సంచలన కామెంట్లు చేశారు. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఇండియా భయపడుతోందన్నారు. చాలావరకు అమెరికా మిత్రదేశాలు, పక్షాలు మాత్రం పుతిన్​ చొరబాటుపై చర్యల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు.

మమ్మల్ని చేర్చుకోండి.. లేదా భయమని ఒప్పుకోండి

ఉక్రెయిన్​కు మద్దతు కూడగట్టే చర్యల్లో భాగంగా వివిధ దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ వరుస ప్రసంగాలు ఇస్తున్నారు. మంగళవారం ఇటలీ పార్లమెంట్ లో వర్చువల్​గా మాట్లాడారు. రష్యా దాడులతో మరియుపోల్​ మరుభూమిగా మారిందని, రష్యాకు భయపడి నాటో ఉక్రెయిన్​కు సభ్యత్వం ఇవ్వడంలేదని ఆరోపించారు. ఉక్రెయిన్​కు వెంటనే నాటో సభ్యత్వం ఇవ్వాలని, లేదంటే రష్యా అంటే తమకు భయమని ఒప్పుకోవాలని అన్నారు. అలాకాని పక్షంలో తమకు సభ్యత్వం ఇవ్వకపోయినా తమ భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్​ చేశారు. అప్పుడే యుద్ధానికి ముగింపు దొరుకుతుందని చెప్పారు. రష్యా బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. ‘‘ఖార్కీవ్, మరియుపోల్, కీవ్​ సిటీలను అప్పగించాలని వారు డిమాండ్​ చేయవచ్చు. కానీ అక్కడి జనాలు వారిని రానివ్వరు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడి ప్రజలను చంపాలి. నిర్మానుష్యంగా మారిన సిటీలు వారి పరమవుతాయి”అని స్పష్టం చేశారు.