మరియుపోల్ పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా

మరియుపోల్ పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా
  • లొంగిపోవాలని రష్యా వార్నింగ్
  • ప్రాణంపోయినా తలొగ్గం:  ఉక్రెయిన్

కీవ్/మాస్కో: ఉక్రెయిన్​ సిటీ మరియుపోల్​పై రష్యా దాడుల తీవ్రతను పెంచింది. నగరంలో ప్రతి పది నిమిషాలకు ఒకటి చొప్పున బాంబుల వర్షం కురిపిస్తోంది. సోమవారం రాత్రి దాడుల ఉధృతిని పెంచిన రష్యా.. అన్ని వైపుల నుంచి మూకుమ్మడిగా ఒత్తిడి పెంచుతోంది. ‘‘ప్రతి పది నిమిషాలకు ఒక బాంబు పడుతోంది. రష్యా యుద్ధనౌకలు షెల్లింగ్​ కొనసాగిస్తున్నాయి. ట్యాంకులు, యుద్ధ వాహనాలతో బలగాలు దాడులు చేస్తున్నాయి. మా సైనికులు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అయినా ఇప్పటికీ మాకు ఆయుధాలు, యాంటీ ట్యాంక్ మిసైల్స్, ఎయిర్​ డిఫెన్స్​ కావాలి” అని ఉక్రెయిన్​కు చెందిన నేషనల్​ గార్డ్​అజోవ్​ రెజిమెంట్​కు చెందిన కెప్టెన్ స్వతోస్లవ్ పలమార్​ పేర్కొన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సరెండర్​ అయ్యే పరిస్థితి లేదని, ప్రాణం ఉన్నంత వరకూ పోరాడతామని చెప్పారు. 

మరియుపోల్​ను వదులుకోబోం..

రష్యాపై పోరాటంలో ఆయుధాలను విడువబోమని, మరియుపోల్ నగరాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తెగేసి చెప్పింది. ఆగ్నేయ ఉక్రెయిన్ లోని మరియుపోల్ నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టిన రష్యా.. నగరంపై మూడు వారాలుగా రోజూ బాంబుల వర్షం కురిపిస్తోంది. అయినా.. ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో నగరంలోని ఉక్రెయిన్ సోల్జర్లు ఆయుధాలు వదిలిపెట్టాలని, తెల్లజెండాలతో వచ్చి లొంగిపోతే నగరం నుంచి రెండు కారిడార్ల ద్వారా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని రష్యన్​కర్నల్ జనరల్ మిఖాయిల్ ఆదివారం రాత్రి హెచ్చరించారు. సోమవారం ఉదయం 5 వరకూ గడువు ఇచ్చారు. అయితే, ఆయుధాలు వదలి, లొంగిపోవడం గురించి చర్చలు ఉండబోవని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్చుక్ స్పష్టం చేశారు. 

కొనసాగిన దాడులు 

కీవ్​లోని ఓ షాపింగ్ మాల్​పై రష్యన్ బలగాలు ఆదివారం జరిపిన బాంబు దాడిలో 8 మంది పౌరు లు చనిపోయారు. సోమవారం కూడా పలు అపార్ట్ మెంట్లపై దాడులు జరిగాయి. సుమీ సిటీలోని అమ్మోనియా ప్లాంటుపై కూడా రష్యా బాంబుదాడి చేసింది. ప్లాంట్ లోని 50 టన్నుల ట్యాంక్ పేలిపోవడంతో రెండున్నర కిలోమీటర్ల వరకూ విష వాయువులు వ్యాపించాయి. రెస్క్యూ టీం వెంటనే అక్కడకు చేరుకుని లీకేజీని అరికట్టింది.

2,389 మంది పిల్లల కిడ్నాప్

డాన్ బాస్ ప్రాంతంలో శనివారం ఒక్కరోజే 2,389 మంది పిల్లలను రష్యన్ బలగాలు బలవంతంగా తరలించాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికొలెంకో వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌరులను కిడ్నాప్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, రష్యా తమ పిల్లల జీవితాలను ప్రమాదంలోకి నెడుతోందని ఆయన ఆరోపించారు. యుద్ధం పేరిట రష్యా చేస్తున్న క్రూరమైన నేరాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.