మా సిటీలను తిరిగి దక్కించుకుంటం: జెలెన్ స్కీ

మా సిటీలను తిరిగి దక్కించుకుంటం: జెలెన్ స్కీ
  • ఎదురుదాడికి ప్లాన్ చేస్తున్నం: జెలెన్ స్కీ వివరణ
  • రష్యా భూభాగాలపై దాడులు చెయ్యబోమని వెల్లడి

బెర్లిన్: రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. ఇందుకోసం ఎదురుదాడికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఆక్రమణకు గురైన తమ ప్రాంతాలను తిరిగి దక్కించుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. రష్యాపై దాడికి తాము ప్లాన్ చేయడం లేదని స్పష్టం చేశారు. రష్యాలోని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నం చేస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. జెలెన్ స్కీ ఆదివారం జర్మనీకి వెళ్లారు. బెర్లిన్ లో జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మీర్, చాన్స్ లర్ ఓలాఫ్ స్కాల్జ్ తో భేటీ అయ్యారు. అనంతరం ఓలాఫ్ ష్కోల్జ్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘రష్యా భూభాగంపై మేం దాడి చెయ్యం. మా భూభాగాలను మాత్రం తిరిగి స్వాధీనం చేసుకుంటం. రష్యాపై దాడి చేసేంత బలం గానీ, టైమ్ గానీ మా దగ్గర లేదు. అందుకు అవసరమైన ఆయుధాలు కూడా లేవు. రష్యా అక్రమంగా మా భూభాగాలను స్వాధీనం చేసుకుంది. వాటిని తిరిగి విడిపించుకోవడమే మా లక్ష్యం. అందుకే ఎదురుదాడికి ప్లాన్ చేస్తున్నం” అని జెలెన్ స్కీ తెలిపారు. ఆర్థిక, మిలటరీ సాయం ప్రకటించినందుకు ఓలాఫ్ ష్కోల్జ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ కు అవసరమైనంత కాలం తమ మద్దతు ఉంటుందని ఓలాఫ్ ష్కోల్జ్ భరోసా ఇచ్చారు. రష్యా తమ దళాలను ఉపసంహరించుకొని యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. 

యుద్ధం మొదలైనంక తొలిసారి జర్మనీకి.. 

రష్యాను ఎదుర్కొనేందుకు మిలటరీ, ఆర్థిక సాయం కోసం మిత్ర దేశాల్లో జెలెన్ స్కీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఇటలీలోని రోమ్ లో పర్యటించారు. అక్కడ ప్రధాని జార్జియా మెలోనీ, పోప్ ఫ్రాన్సిస్ తో భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఆదివారం జర్మనీకి వచ్చారు. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి జెలెన్ స్కీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ కు రూ.24 వేల కోట్లకు పైగా మిలటరీ ప్యాకేజీ అందజేస్తామని శనివారం జర్మనీ ప్రకటించగా, ఆ తెల్లారే జెలెన్ స్కీ అక్కడ పర్యటనకు వచ్చారు. మిలటరీ ఎక్విప్ మెంట్ డెలివరీపై చర్చలు జరిపారు. కాగా, ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ తో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు అందజేస్తామని జర్మనీ ప్రకటించింది.
 
జెలెన్​స్కీకి చార్లెమాగ్నే  ప్రైజ్.. 

జర్మనీ ప్రకటించిన ఇంటర్నేషనల్ చార్లెమాగ్నే ప్రైజ్​ను జెలెన్ స్కీ ఆదివారం అందుకున్నారు. ఆచెన్ సిటీలో జరిగిన కార్యక్ర మంలో ఓలాఫ్ ష్కోల్జ్​తో కలిసి పాల్గొన్నారు. యూరోపియన్ యూనిటీకి కృషి చేస్తున్నోళ్లకు ఏటా ఈ అవార్డు అందజేస్తారు. రష్యా దాడిని ఉక్రెయిన్ ప్రజలు, జెలెన్ స్కీ ఎదుర్కొంటూ యూరోపియన్ విలువలను కాపాడుతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.