ఉక్రెయిన్ ను వణికిస్తున్న కలరా

ఉక్రెయిన్ ను వణికిస్తున్న కలరా

రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ ఇప్పుడు కలరా వ్యాధితో సతమతమవుతోంది. చెత్త, కుళ్లిన శవాలు, కలుషిత నీరు వాటి చుట్టూ ముసురుతున్న కీటకాలు ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలను భయపెడుతున్నాయి. రష్యా బాంబులతో అట్టుడుకిపోయిన మరియుపోల్, ఖేర్సన్ నగరాల్లో ఎటుచూసినా శవాలే కనిపిస్తున్నాయి. అక్కడ నెలకొన్న పరిస్థితులు కలరా వ్యాధి వ్యాప్తికి దారి తీస్తున్నాయి. 

ఇప్పటికే కొన్ని కలరా కేసులను గుర్తించామని మరియుపోల్ గవర్నర్ స్పష్టం చేశారు. మరోవైపు రష్యా నియమించిన గవర్నర్ చెప్పిన వాదన మాత్రం భిన్నంగా ఉంది. తరచూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఇప్పటి వరకు ఒక్క కలరా కేసు కూడా వెలుగులోకి రాలేదని చెప్పారు. మూడు నెలల నిరంతర దాడుల తర్వాత రష్యా.. మరియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. 

ఇదిలా ఉంటే శవాల చుట్టూ ముసురుతున్న ఈగలు, బొద్దింకల వంటి కీటకాలు కలరా వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కలరా రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.