రష్యాతో యుద్ధం వేళ.. భారత్ కు వస్తున్న ఉక్రెయిన్ మహిళా మంత్రి

రష్యాతో యుద్ధం వేళ.. భారత్ కు వస్తున్న ఉక్రెయిన్ మహిళా మంత్రి

ఉక్రెయిన్(Ukrine)- రష్యా(Russia)  యుద్ధం పై భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. దౌత్యపరమైన చర్చలతో శాంతి మార్గంలోనే దీనిని పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు ప్రధాని మోడీ సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ  మంత్రి ఎమైన్ జపరోవా భారత పర్యటనకు రానుండటం విశేషం.

ఏప్రిల్ 10 నుంచి నాలుగు రోజుల పాటు ఆమె ఇక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు, ఉక్రెయిన్ అంశం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు తదితర విషయాలపై చర్చలు జరపనున్నట్టుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, ఈ పర్యటనలో ఆమె విదేశీ మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయక మంత్రి మీనాక్షి లేఖి, డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు విక్రమ్ మిస్రీని మాత్రమే కలవనున్నారు. 

ఉక్రెయిన్ తో  రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఆ దేశం నుంచి ఓ మంత్రి భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి.  ఈ నేపథ్యంలో భారత్ నుంచి సైనిక, మౌలిక, మానవతా పరమైన సాయం కోరనున్నట్టుగా సమాచారం. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra modi)ని కీవ్ నగరానికి ఆమె ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ‘‘ఉక్రెయిన్ తో భారత్ కు ద్వౌపాక్షిక,స్నేహపూర్వక బంధాలు ఉన్నాయి. 30 ఏళ్ల ఈ మైత్రిలో విద్యా, వాణిజ్యం, సాంస్కృతి మరియు రక్షణ రంగాలలో ఇరు దేశాలు సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి’’ అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో దేశాధినేతలతో నిర్వహించనున్న జీ20 సమ్మిట్ కు భారత్ అధ్యక్షత వహిస్తోంది.  ఈ నేపథ్యంలో తాజా పర్యటన ఆసక్తికరంగా మారింది.