పద్మారావునగర్, వెలుగు: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఇంటర్ విద్యార్థిని పవిత్రను అతిదారుణంగా హత్య చేసిన ఆమె మేనబావ ఉమాశంకర్‌ను సికింద్రాబాద్వారాసిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పార్శీగుట్ట బాపూజీనగర్ లో నివసించే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతుల పెద్ద కూతురు పవిత్ర(18)ను ఆమె తల్లి, చెల్లి ముందే ఉమాశంకర్కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సోమవారం రాత్రి సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతను జవహర్ నగర్లో ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉమాశంకర్ ను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా పవిత్ర మృతదేహానికి మంగళవారం ఉదయం గాంధీ దవాఖానలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం బాపూజీనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. స్థానికులు అధిక సంఖ్యలో ఆమె అంతిమయాత్రలో పాల్గొని, కన్నీటి వీడ్కోలు పలికారు.

