ఫారెస్టోళ్ల వేధింపులకు మహిళా రైతు ఆత్మహత్య

ఫారెస్టోళ్ల వేధింపులకు మహిళా రైతు ఆత్మహత్య

ములుగు: అటవీ అధికారుల వేధింపులు భరించలేక ఓ మహిళా పోడు రైతు ఆత్మహత్య చేసుకుంది. తనకున్న కొద్దిపాటి భూమిని అధికారులు లాక్కుంటారనే  భయంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాయబంధం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములపైకి ఈనెల 19న  ఫారెస్ట్ అధికారులు డోజర్ తీసుకెళ్లి లెవలింగ్ చేస్తుండగా గ్రామంలోని మహిళా రైతులు అడ్డుకున్నారు.

దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ నెల 24న తిరిగి వస్తామని.. మొక్కలు నాటడానికి మాకు సగం భూమి కచ్చితంగా ఇవ్వాలని.. హెచ్చరించి వెనుదిరిగి వెళ్లారు. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మా భూమిని లాక్కుంటారనే భయంతో పోడు మహిళా రైతు  పద్దం ఎర్రమ్మ మంగళవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఫారెస్టు ఆఫీసర్ల వేధింపులే ఎర్రమ్మ మృతికి కారణమని బాధిత రైతులు తెలిపారు.