
- చందాలు వసూలు చేసి డ్రైనేజీ పనులు?
- ఒక్కో ఇంటి నుంచి రూ.25 వేల చొప్పున వసూల్
- అనుమతులు లేకుండానే పనులు
- ఫీర్జాదిగూడ డీఈ అత్యుత్సాహం
- ఇంత జరుగుతున్నా పైఅధికారులకు తెలియని వ్యవహారం
మేడిపల్లి, వెలుగు: మున్సిపల్ పరిధిలో ఏదైనా పనిచేయాలంటే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాలి. ఉన్నతాధికారులు వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. పైఅధికారుల అనుమతి ఉండాలి. కానీ ఇవేవీ లేకుండానే ఓ అధికారి డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టాడు. అందుకు కావాల్సిన నిధులను కాలనీ ప్రజల నుంచే వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు పైఅధికారులకు తెలియకపోవడం గమనార్హం.
ఫీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని మూడో డివిజన్ సాయి ఐశ్వర్య కాలనీలో కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా కాలనీలోని ఇండ్ల ఓనర్ల నుంచి తలా రూ.25 వేల చొప్పున వసూలు చేసి ఈ పనులు చేపడుతున్నట్లు తెలిసింది.
మున్సిపల్ ఇంజినీరింగ్ సెక్షన్ అధికారి డీఈ సాయినాథ్ గౌడ్ అత్యుత్సాహంతో ఈ వ్యవహారానికి తెర లేపినట్టు సమాచారం. గతంలోనూ పలు కాలనీల్లో ఇలానే చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫీర్జాదిగూడ కమిషనర్‌ను వివరణ కోరగా.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.