బాలీవుడ్ డైరెక్టర్ ను బెదించిన కేసులో..అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్

బాలీవుడ్ డైరెక్టర్ ను బెదించిన కేసులో..అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్

బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా , అతని భార్య లిజెల్లే డిసౌజా ను బెదిరించిన కేసులో అండర్ వరల్డ్ డాన్ రవి పుజారీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదేళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేసి  ఇండియాకు తీసుకొచ్చినప్పటినుంచి  రవిపుజారీ జైలులో ఉన్నా... ఈ ప్రత్యేక కేసులో అధికారికంగా అరెస్ట్ కాలేదు. గురువారం (జనవరి 22) క్రైం బ్రాంచి  యాంటీ ఎక్సార్షన్ సెల్  పోలీసులు  ఎస్ప్లాండే కోర్టు ముందు హాజరు పర్చారు. జనవరి 27 వరకు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. 

ఈ కేసులో గతంలో అరెస్టయిన మరో నిందితుడు సత్యేంద్ర త్యాగితో కలిసి రవిపుజారీ రెమో డిసౌజ, అతని భార్యను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. 2018లో రెమో డిసౌజా, సత్యేంద్ర త్యాగితో అమర్ మస్ట్ డై సినిమా నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.  అయితే వారి మధ్య విభేధాలు రావడంతో త్యాగి ఈ ప్రాజెక్టులో పెట్టిన రూ. 5కోట్లు రావాల్సి ఉండగా.. రెమో ఇవ్వలేదని ఆరోపణలతో రవిపుజారీతో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

రెమో డిసౌజా, అతని భార్య ను బెదిరించడమే కాకుండా ఈ వివాదాన్ని సెటిల్ చేసేందుకు తనకు రూ. 50 లక్షాలు ఇవ్వాలని రవిపుజారి డిమాండ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈకేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.