- రూ.80 నుంచి 120కి చేరిన పరీక్ష ఫీజు
- వేర్వేరు నోటిఫికేషన్లతో అభ్యర్థులపై అదనపు భారం
- నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నిరుద్యోగుల ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులపై టీజీపీఎస్సీ ఫీజుల భారం మోపింది. గతంలో రూ. 200 ఉన్న అప్లికేషన్ ఫీజును వెయ్యి రూపాయలకు పెంచుతూ షాక్ ఇచ్చింది. ‘ఫీజులు తగ్గిస్తాం.. నిరుద్యోగులను ఆదుకుంటాం..’ అని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇస్తే.. అధికారులు మాత్రం ఫీజులు పెంచడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల టీజీపీఎస్సీ ఐదు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. పీసీబీలో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులు, ఆర్ అండ్ బీలో 222 ఏఈఈ (సివిల్) , 49 ఏఈఈ (ఎలక్టికల్) పోస్టులతో పాటు పీసీబీలో మరో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించింది. వీటితో పాటు 24 డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా ఆయా పోస్టులకు బీసీ, ఓసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుందని ప్రకటించింది. దీంతోపాటు ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 ఉంటుందని వెల్లడించింది.
రూ.200 నుంచి వెయ్యికి...
ఇక నుంచి వచ్చే అన్ని నోటిఫికేషన్లకూ కొత్త ఫీజులే ఉండే అవకాశం ఉంది. గతంలో బీసీ, జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 200 ఉండగా, రూ.వెయ్యికి పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 500 ఖరారు చేశారు. దీనికి తోడు పరీక్ష ఫీజును కూడా రూ. 80 నుంచి రూ. 120కి పెంచారు. గతంలో తక్కువ ఫీజుతోనే వేల పోస్టులను భర్తీ చేసిన కమిషన్.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఫీజులు పెంచిందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఎందుకు పెంచాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా అధికారులు ప్రకటించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
విడివిడి నోటిఫికేషన్లు..
నోటిఫికేషన్ల విషయంలోనూ కమిషన్ కొత్త విధానం అమలు చేయాలని భావిస్తోంది. విడివిడిగా నోటిఫికేషన్లు ఇస్తే త్వరితగతిన ఫలితాలు ఇవ్వవచ్చని, లీగల్ సమస్యల నుంచి బయటపడవచ్చని యోచిస్తోంది. కానీ, నిరుద్యోగుల ఫీజుల అంశాన్ని మాత్రం పట్టించుకోలేదు. గతంలో ఒకే రకమైన అర్హతలున్న పోస్టులకు కామన్ నోటిఫికేషన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు విడివిడిగా నోటిఫికేషన్లు ఇస్తుండటంతో అభ్యర్థులు ఒక్కో పోస్టుకు రూ. వెయ్యికి పైగా చెల్లించాల్సి వస్తోంది. ఇది నిరుద్యోగులను దోచుకోవడమేనని నిరుద్యోగ, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు..
ఎన్నికల ముందు టీజీపీఎస్సీ పరీక్షల ఫీజుల భారాన్ని తగ్గిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ అప్పులు చేసి చదువుకుంటున్న తమపై ఈ భారం వేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పలువురు అభ్యర్థులు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ ఫీజుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
