పల్లెల్లో నిరుద్యోగం పెరిగింది

పల్లెల్లో నిరుద్యోగం పెరిగింది

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని రోజు రోజుకీ నిరుద్యోగం పెరుగుతోంది. ఈ వారంలో ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయిన వారి సంఖ్య పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. జులై 25తో ముగిసిన గత  వారంలో పల్లెల్లో నిరుద్యోగం రేటు 6.75 శాతంగా ఉందని ఆ సంస్థ తాజా డేటా వెల్లడించింది. అంతకు ముందు వారం చివరిలో ఇది 5.1 శాతం ఉండేది. ఒక్కవారంలో 1.65 శాతం పెరిగింది. ఈ వారం రోజుల్లో పట్టణాల్లో నిరుద్యోగం రేటు పెరుగుదల పల్లెలతో పోలిస్తే కొంత మేర తక్కువగా ఉంది. గత వారాంతానికి 7.94 శాతం ఉంటే ఇప్పుడు 8.01 శాతానికి చేరింది. అయితే  జాతీయ సగటు, పల్లెల నిరుద్యోగం రేటుతో పోలిస్తే అర్బన్ అన్‌ఎంప్లాయిమెంట్‌ రేటు ఎక్కువగా ఉంది. కరోనా ఆంక్షల సడలింపుతో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగినా కూడా ఈ పరిస్థితిలో మార్పు రాలేదని సీఎంఐఈ పేర్కొంది. నేషనల్ యావరేజ్‌ అన్‌ఎంప్లాయిమెంట్‌ రేటు గతం వారంలో 5.98 శాతం ఉంటే ప్రస్తుతం 7.14 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
మూడు నెలలతో పోలిస్తే చాలా బెటర్
ఈ వారంలో ఓవరాల్ నిరుద్యోగం రేటు పెరిగినప్పటికీ, గత మూడు నెలలతో పోలిస్తే మాత్రం పరిస్థితి చాలా బెటర్‌‌గా ఉందని సీఎంఐఈ తెలిపింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి,  నిరుద్యోగం రేటు భారీగా పెరిగింది. జులై నెల మొదటి నుంచి పట్నాల్లో నిరుద్యోగం రేటు 9 శాతం లోపే ఉంది. జాతీయ సగటు 8 శాతం కంటే తక్కువగా కొనసాగుతోంది. జూన్‌లో నేషనల్ యావరేజ్‌ 9.17%, అర్బన్ 10.07%, రూరల్ అన్‌ఎంప్లాయిమెంట్ రేటు 8.75 శాతం చొప్పున నమోదైంది. కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో పెరుగుదల అత్యంత తక్కువగానే ఉంది. అయితే జూన్ నుంచి క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది.