రామప్పకు యునెస్కో టీమ్

రామప్పకు యునెస్కో టీమ్
  •                ఈ సారైనా గుర్తింపు దక్కేనా?
  •                 వరంగల్‌‌ చేరుకున్న ప్రతినిధి బృందం

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగ గుర్తించే ప్రక్రియలో భాగంగా నేడు(బుధవారం) యునెస్కో ప్రతినిధులు పరిశీలించనున్నారు. రాష్ట్ర పురావాస్తు శాఖ, ములుగు జిల్లా అధికారులు వీరి రెండు రోజుల పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను చాలా సుందరంగా తీర్చిదిద్దారు. బోర్డులు ఏర్పాటు చేశారు. రామప్ప గుడిని ఏటా 60 వేలకు పైగా పర్యాటకులు సందర్శిస్తారు. 200కు పైగా విదేశీ పర్యాటకులు వస్తూంటారు. యునెస్కో గుర్తింపు దక్కితే ఈ సంఖ్య పెరుగుతుంది. యునెస్కో టీమ్‌‌ మంగళవారం రాత్రి వరంగల్‌‌ చేరుకుంది. ఇంటర్నేషనల్‌‌ కౌన్సిల్‌‌ ఆన్‌‌ మాన్యుమెంట్స్‌‌ సైట్స్‌‌ ప్రతినిధి వాసు పోషియా నందన్ (థాయిలాండ్) ఆధ్వర్యంలోని టీమ్‌‌కు రాష్ట్ర అధికారులు స్వాగతం పలికారు. హన్మకొండలోని హరిత కాకతీయలో వారికి బస ఏర్పాటు చేశారు. 25వ తేదీ(బుధవారం) ఉదయం రామప్ప దేవాలయానికి విచ్చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు దేవాలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించి వెళ్లిపోతారు. సాయంత్రం హన్మకొండలోని  వేయిస్తంబాల దేవాలయం పరిశీలన, ఆర్కాలజీ, జిల్లా అధికారులతో సమావేశం, పవర్ ప్రజెంటేషన్ ఉంటుంది. 26వ తేదీ కూడా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరిశీలిస్తారని పురావాస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. రామప్ప దేవాలయం గతేడాది కూడా యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడింది. అయినా గుర్తింపు రాలేదు. ఈ సారి గుర్తింపు సాధించాలని పురావాస్తు శాఖ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గుడికి పడమర ద్వారం వైపు గతంలో వేసిన గుడిసెలు తొలగించి పార్కింగ్‌‌‌‌ స్థలంగా మార్చారు. ఆవరణను చదును చేసి ఇసుక నింపారు. అక్కడక్కడ పాలరాతితో పనులు చేశారు. తూర్పు ద్వారం వైపు కొత్తగా సీసీ రోడ్డు నిర్మించారు. బురదనీటిని తీసెసి మట్టి పోసి చదును చేశారు. రామప్ప ఆలయం, అనుబంధ ఆలయాల చుట్టూ పెరిగిన చెత్తాచెదారాన్ని తొలగించేశారు.