రామప్ప టెంపుల్ ను పరిశీలించిన యునెస్కో టీమ్‌‌

రామప్ప టెంపుల్ ను పరిశీలించిన యునెస్కో టీమ్‌‌
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాల వెల్లడి
  • నేడూ పర్యటించనున్న సభ్యులు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా గుర్తింపు కోసం పోటీ పడుతున్న రామప్ప దేవాలయాన్ని యునెస్కో టీమ్‌‌ బుధవారం పరిశీలించింది. యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన ఆధ్వర్యంలో టీమ్‌‌ మెంబర్లు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరిశీలించారు. వరల్డ్ హెరిటేజ్ సూపరింటెండెంట్ మిలన్ కుమార్ చౌలెన్, బీవీ పాపారావు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, యునెస్కో కన్సల్టెంట్ చూడామణి, నందగోపాల్ ఆలయానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రామ్‌‌సింగ్ జి.పాటిల్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఉమాశంకర్, హరీశ్‌‌ శర్మ సాదరస్వాగతం పలికారు. రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యునెస్కో నిపుణుడు వాసు పోశ్యానందనకు పూలమాలవేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారు వస్త్రాలను అందజేశారు. అనంతరం టూరిజం గైడ్లు గోరంట్ల విజయ్కుమార్, తాడవేన వెంక టేశ్ లు  కాకతీయుల చరిత్ర వివరించారు. గర్భగుడితోపాటు ఆలయ మండపంపై చెక్కిన శిల్పాలు, గర్భగుడి ముఖద్వారం వద్ద ఉన్న సప్తస్వరాలు, పలు అందమైన శిల్పాలు, దారం దూరని శిల్పాల ఆకృతి, విశిష్ఠతలను వివరించారు. శిల్ప సంపద చూసి వాసు పోశ్యనందన అబ్బురపడ్డారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు ఆలయానికి సంబంధించిన చరిత్రను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతీ శిల్పం చరిత్ర వివరించారు. యునెస్కో, పురాస్తుశాఖ ప్రతినిధులు గురువారం సైతం ఆలయాన్ని సందర్శించనున్నారు. మొదటిరోజు ఆలయ చరిత్రపై పూర్తిగా తెలుసుకున్న టీమ్‌‌ రెండో రోజు ఆలయంలో వివిధ శాఖల అధికారులతో, గ్రామస్తులతో ఇంటరాక్ట్ కానున్నారు. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ శాఖ డైరెక్టర్ దినకర్ బాబు, టూరిజం జిల్లా అధికారి శివాజీ, తహసీల్దార్ దేవాసింగ్, టూరిజం పరిశోధకుడు అరవింద్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.