- మహాజాతరకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా
- 200ల ట్రాన్స్ఫార్మర్లు, 350 మంది బృందంతో పర్యవేక్షణ
- - నార్లాపూర్ వద్ద ప్రత్యేకంగా 33/11కేవీ సబ్స్టేషన్, 13,050 విద్యుత్ లైట్ల ఏర్పాటు
ములుగు, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పరిసరాలు విద్యుత్ కాంతుల్లో వెలుగొందుతోంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతోపాటు గోవిందరాజులు, పగిడిద్ద రాజుల ప్రాంగణాన్ని పునర్నిర్మించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడారంలో నిరంతర కరెంట్ సరఫరాకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
200 ట్రాన్స్ ఫార్మర్లు, 350 మంది సిబ్బంది..
టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో మేడారం మహాజాతరలో విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. సీఎం రేవంత్రెడ్డి సెప్టెంబర్ లో పర్యటన నాటి నుంచే సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మొత్తం జాతరలో 200 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 50 ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. ఒక్కో బ్యాచ్ లో ఒక ఇంజినీర్ తోపాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
వీరు మేడారం జాతర పరిసరాలతోపాటు పార్కింగ్ ప్రదేశాలు, చిలుకలగుట్ట, కన్నెపల్లి, మేడారం, రెడ్డిగూడెం, ఆర్టీసీ బస్టాండ్, మ్యూజియం, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. వీరితో పాటు 50 మంది ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేశారు. గోవిందరావుపేట మండలం పస్రా నుంచి తాడ్వాయి, పస్రా - మేడారం, తాడ్వాయి - మేడారం రూట్లలో బృందాలు పర్యవేక్షిస్తూ విద్యుత్ సమస్యలు రాకుండా
పర్యవేక్షించనున్నాయి.
3,050 లైట్లతో విద్యుత్ కాంతులు..
మేడారంలో రాత్రి కావస్తుండగానే విద్యుత్ వెలుగులు జిగేల్ మంటున్నాయి. ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు, ఆలయ పరిసరాలు, చిలుకల గుట్ట, సారలమ్మ, సమ్మక్క గుళ్లు, మ్యూజియం, ఇంగ్లీష్ మీడియం స్కూల్, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా భక్తులు విడిది చేసే ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకున్నారు. 4 పోల్స్ లైట్స్ 265, 100 వాట్స్ లైట్స్ 7,056, 150 వాట్స్ 4,240, 200 వాట్స్ 877 లైట్లను వినియోగించారు. అదనంగా పార్కింగ్ ప్రాంతాల్లో నాలుగు పోల్స్ లైట్లు 20, 100 వాట్స్ లైట్స్ 480 సైతం అమర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి అంతరాయం ఏర్పడినా వెంటనే పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశారు.
నార్లాపూర్ వద్ద 33/11కేవీ సబ్ స్టేషన్..
మేడారం జాతర కోసం ప్రత్యేకంగా శాశ్వతప్రాతిపదికన విద్యుత్ సరఫరా అందించేందుకు తాడ్వాయి మండలం నార్లాపూర్ శివారులో 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను నిర్మించారు. రూ.2 కోట్లతో ప్రభుత్వం అనుమతివ్వగా ప్రస్తుతం మేడారం భక్తులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మహాజాతర పూర్తయిన తర్వాత కూడా ఈ సబ్ స్టేషన్ ద్వారా నార్లాపూర్ సమీప గ్రామాల ప్రజలకు విద్యుత్ సరఫరా చేయనున్నారు. జాతర ఏర్పాట్ల కోసం రూ.8 కోట్ల అంచనాతో విద్యుత్ అధికారులు పనులు చేపట్టారు. మేడారం పరిసరాల్లో కొత్త పోల్స్ తోపాటు ట్రాన్స్ఫార్మర్లను అమర్చారు. 911 ఎలక్ట్రికల్ పోల్స్, 200 ట్రాన్స్ఫార్మర్లు, 56.88 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లతో అంచనా వేయగా అవసరమైన మేర మరిన్ని పోల్స్, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
భక్తులు ఆపద సమయంలో 1912కు కాల్ చేయండి
మేడారం వచ్చే భక్తులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. పోల్స్, ట్రాన్స్ఫార్మర్లకు వేసిన ఫెన్సింగ్ లను ముట్టుకోవద్దు, హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నాం. స్నానాలు చేసిన తర్వాత తడిబట్టలు విద్యుత్ వాహకాలకు సమీపంలో ఆరవేయొద్దు. హుకింగులతో ప్రాణాలకు ముప్పు ఉంటుంది. వాహనదారులు సైతం పోల్స్ ను డ్యామేజ్ చేయకుండా వెళ్లాలి. వ్యాపారులు, గృహస్తులు మేడారంలో మంచి వాహకాలు కలిగిన క్వాలిటీ వైర్లను వినియోగించుకోవాలి.
మేడారంలో లోడ్ ను బట్టి నిబంధనల మేరకు వినియోగదారుల నుంచి చార్జ్ వసూలు చేస్తాం. జాతర పూర్తయ్యే వరకు మేడారంలో టీజీఎన్పీడీసీఎల్ విభాగం నుంచి ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు సీఈలు, ఇద్దరు ఎస్ఈలు, 8 మంది డీఈలు, ఇతర ఇంజినీర్లు విధులు నిర్వర్తిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు కాల్ చేసి సమాచారం అందించాలి. - ఎ.ఆనందం, ఎస్ఈ, ములుగు
