‘ట్రిపుల్​ తలాక్​’పై  మళ్లీ బిల్లు

 ‘ట్రిపుల్​ తలాక్​’పై  మళ్లీ బిల్లు
  • బడ్జెట్​ సమావేశాల్లోనే పార్లమెంట్​ ముందుకు
  • ఆర్డినెన్స్​ను చట్టంగా మలిచేందుకు కేంద్రం ప్రయత్నం
  • బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్​
  • 16వ లోక్​సభ గడువు ముగియడంతో పాత బిల్లుకు చెల్లు
  • ఆధార్,  టీచర్ల రిజర్వేషన్​ బిల్లులకు కూడా ఓకే
  • జమ్మూకాశ్మీర్​లో రాష్ట్రపతి పాలన 6 నెలలు పొడిగింపు
  • 17 నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

న్యూఢిల్లీ: ట్రిపుల్​ తలాక్​ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో బిల్లును రూపొందించింది. దీనికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. మొదట లోక్​సభలో ప్రవేశపెట్టి.. అక్కడ ఆమోదం లభించగానే రాజ్యసభలో ప్రవేశపెడుతారు. రాజ్యసభ కూడా ఆమోదం తెలిపితే రాష్ట్రపతి వద్దకు పంపుతారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టం రూపంలోకి వస్తుంది. మోడీ ఫస్ట్​ టర్మ్​లోనూ ట్రిపుల్​ తలాక్​ నిషేధిస్తూ ముస్లిం ఉమెన్​ (ప్రొటెక్షన్​ ఆఫ్​ రైట్స్​ ఆన్​ మ్యారేజీ) బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టగా.. అక్కడ ఆమోదం లభించినా, ప్రతిపక్షాల అభ్యంతరాల వల్ల రాజ్యసభలో నిలిచిపోయింది. ఇటీవల 16వ లోక్​సభ గడువు ముగియడంతో ఆ బిల్లుకు కాలం చెల్లిపోయింది. ఫలితంగా మళ్లీ కొత్తగా బిల్లును కేంద్రం రూపొందించాల్సి వచ్చింది.

లోక్​సభ రద్దయితే వాటి కాలం చెల్లినట్లే

నిబంధనల ప్రకారం లోక్‌‌సభ రద్దయితే ఉభయ సభల ఆమోదం పొందని బిల్లులు మనుగడలో ఉండవు. బిల్లులు లోక్‌‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌‌లో ఉన్నా లోక్‌‌సభ రద్దయితే ఆ బిల్లులు కూడా వాటంతట అవే రద్దవుతాయి. మళ్లీ కొత్తగా బిల్లును రూపొందించి దాన్ని రెండు సభల్లోనూ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది.

ఆధార్​ సవరణ బిల్లుకు ఆమోదం

ఆధార్​ యాక్ట్​–2016 కు సవరణ చేస్తూ కేంద్రం బిల్లు తెచ్చింది. మొబైల్​ సిమ్​కార్డుల జారీ కోసం, బ్యాంకు ఖాతాల ఓపెనింగ్​ కోసం స్వచ్ఛందంగా మాత్రమే ఆధార్‌‌ను ఐడీ కార్డుగా వినియోగించుకోవాలని, బలవంతంగా తీసుకోరాదని ఇందులో పేర్కొన్నారు. గతంలో ఇదే అంశంపై ఆర్డినెన్స్​ తేగా ఇప్పుడు బిల్లుగా పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆర్డినెన్స్​లో పేర్కొన్నట్లుగా సంస్థలపై రూ. కోటి జరిమానా, అదే పనిగా ఉల్లంఘనలు కొనసాగితే ప్రతీ రోజుకు రూ.10 లక్షల చొప్పున జరిమానాలు విధించనున్నారు.

200 పాయింట్​ రోస్టర్​కు ఓకే

విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ నియామకం కోసం 200 పాయింట్‌‌ రోస్టర్‌‌ విధానాన్ని అమలు చేసే ‘ది సెంట్రల్​ ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్​ (రిజర్వేషన్​ ఇన్​ టీచర్స్​ కేడర్​) బిల్లు‌‌‌‌–2019’కు కేబినెట్​ ఓకే చెప్పింది. కళాశాల లేదా యూనివర్శిటీని యూనిట్‌‌గా తీసుకుని 200 రోస్టర్‌‌ విధానాన్ని పునురుద్ధరించాలని, 13 పాయింట్ల రోస్టర్​ విధానాన్ని ఎత్తివేయాలని స్టూడెంట్స్​ యూనియన్స్​, ఫాకల్టీ యూనియన్స్​ చేస్తున్న డిమాండ్​ దృష్ట్యా  మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్​ తీసుకువచ్చింది. హోమియోపతి సెంట్రల్​ కౌన్సిల్​ (సవరణ) బిల్లు, ఇండియన్​ మెడికల్​ కౌన్సిల్​ (సవరణ) బిల్లు, సెజ్​ (సవరణ)  బిల్లు సహా మొత్తంగా 10 బిల్లులకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. వీటిని వచ్చే పార్లమెంట్​ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

జమ్మూకాశ్మీర్​లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

జమ్మూకాశ్మీర్​లో రాష్ట్రపతి పాలనను మరో ఆరునెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్​లోని సరిహద్దు ప్రాంతంలో నివసించేవారికి రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన జమ్మూకాశ్మీర్​ రిజర్వేషన్​ బిల్లుకూ కేబినెట్​ ఆమోదం తెలిపింది.

గడువులోగా  చట్టంగా మలిచేందుకు..

ట్రిపుల్​ తలాక్​ పేరిట ముస్లిం మహిళలకు అకారణంగా విడాకులు ఇస్తున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని దాన్ని రద్దు చేసేందుకు మొన్నటి ఫస్ట్​ టర్మ్​ పాలనలో మోడీ సర్కార్​ ప్రయత్నించింది. ఇందుకోసం ముస్లిం ఉమెన్​ (ప్రొటెక్షన్​ ఆఫ్​ రైట్స్​ ఆన్​ మ్యారేజీ) పేరిట బిల్లును తెచ్చింది.  అందులో ట్రిపుల్​ తలాక్​ పాటించడాన్ని నేరంగా పేర్కొనడం వంటి నిబంధనలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో బిల్లు రాజ్యసభలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో కేంద్రం ముస్లిం ఉమెన్  ఆర్డినెన్స్‌‌–2019ను తీసుకువచ్చింది. దీని ప్రకారం దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్దం. అతిక్రమించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఏదైనా ఆర్డినెన్స్​ను తీసుకువచ్చినప్పుడు చట్ట రూపం కల్పిస్తేనే మనుగడలో ఉంటుంది. లేకపోతే ఎక్స్​పైరీ అవుతుంది. ఆర్డినెన్స్​ తెచ్చాక జరిగే మొదటి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి 45 రోజుల్లోపు చట్టంగా మార్చాల్సి ఉంటుంది.