ప్రభుత్వ ఆస్తులను లీజుతో..ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు

ప్రభుత్వ ఆస్తులను లీజుతో..ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు
  • ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా సమీకరణ
  • ఇన్​ఫ్రాకు భారీ నిధులు
  • ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి

న్యూఢిల్లీ:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలో నేషనల్ మానిటైజేషన్ పైప్‌‌లైన్ (ఎన్​ఎంపీ) 2.0ను విడుదల చేశారు. 2026 ఆర్థిక సంవత్సరం నుంచి 2030 ఆర్థిక సంవత్సరం వరకు అంటే ఐదేళ్ల కాలంలో రూ.10 లక్షల కోట్లు సమీకరించడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు.  మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎమ్​ఎన్​పీ ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. 

మొదటి విడతలో భాగంగా 2021లో ప్రారంభించిన ఎన్​ఎంపీ 1.0 ద్వారా రూ.ఆరు లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, రూ.5.3 లక్షల కోట్లు సాధించారు. అంటే దాదాపు 89 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎన్​ఎంపీ 2.0 కింద మొత్తం రూ.16.72 లక్షల కోట్ల విలువైన ఆస్తుల మానిటైజేషన్ సామర్థ్యం ఉన్నట్లు అంచనా వేశారు. ఇందులో ప్రైవేట్ రంగ పెట్టుబడులు రూ.5.8 లక్షల కోట్లు ఉండనున్నాయి. 

రంగాల వారీగా చూస్తే హైవేల నుంచి రూ.4.42 లక్షల కోట్లు వస్తాయని భావిస్తున్నారు. విద్యుత్ రంగం నుంచి రూ.2.77 లక్షల కోట్లు, ఓడరేవుల నుంచి రూ.2.64 లక్షల కోట్లు, రైల్వేల నుంచి రూ.2.62 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవే కాకుండా పెట్రోలియం, సహజ వాయువు, విమానయానం, టెలికాం, పర్యాటకం వంటి కీలక రంగాల్లో కూడా ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

నాట్​ ఫర్​ సేల్​..

ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆస్తులను విక్రయించకుండా కేవలం లీజుకు ఇవ్వడం లేదా ఇతర పద్ధతుల ద్వారా నిధులను సేకరిస్తారు. ఇలా వచ్చిన నిధులను తిరిగి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం లేదా క్యాపిటల్ ఎక్స్​పెండిచర్ కోసం వినియోగిస్తారు. దీనివల్ల ప్రభుత్వ బడ్జెట్ పై భారం తగ్గుతుందని మంత్రి వివరించారు. 

ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్​గా ఒక ప్రత్యేక కార్యదర్శుల బృందం పనిచేస్తుంది. పీపీపీ పద్ధతి లేదా ఇన్విట్ వంటి మార్గాల ద్వారా ఈ ఆస్తులను మానిటైజ్ చేస్తారు. ఇదిలా ఉంటే,   కేంద్ర బ్యాంకులు భారీగా పసిడిని కొనడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, వీటి దిగుమతులపై ఆందోళన చెందడం లేదని   నిర్మల అన్నారు. ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.