బీజేపీకి ఆ చాన్సే లేదు.. నితిన్ నబీన్‌‌‌‌‌‌‌‌ 3 రోజుల పర్యటన అట్టర్ ఫ్లాప్‌‌‌‌‌‌‌‌

బీజేపీకి ఆ చాన్సే లేదు.. నితిన్ నబీన్‌‌‌‌‌‌‌‌ 3 రోజుల పర్యటన అట్టర్ ఫ్లాప్‌‌‌‌‌‌‌‌

 

  •     ఇక్కడ మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే 
  •     మీ పాలన.. మా పాలనపై చర్చకు సిద్ధమా? అని బీజేపీకి సవాల్‌‌‌‌‌‌‌‌
  •     బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు నూకలు చెల్లినయ్‌‌‌‌‌‌‌‌.. 
  • అందుకే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫామ్​హౌస్‌‌‌‌‌‌‌‌కే పరిమితం
  •     హరీశ్‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కడ తిరిగినా 
  • ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు
  •     యాదగిరి గుట్ట బోర్డు నియామకంపై రాజకీయాలు వద్దని విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: దేశంలో12 ఏండ్ల మీ పాలనపై, రాష్ట్రంలో రెండున్నరేండ్ల మా పాలనపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌ గౌడ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో మేం చేసిందేమిటో, కేంద్రంలో ఉండి మీరు చేసిందేమిటో చర్చిద్దామా? అని అడిగారు.  బుధవారం గాంధీ  భవన్‌‌‌‌లో మహేశ్‌‌‌‌గౌడ్​ మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ  జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌‌‌‌ మూడు రోజుల రాష్ట్ర పర్యటన అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. మూడు రోజుల తెలంగాణ టూర్‌‌‌‌‌‌‌‌లో నితిన్ నబీన్‌‌‌‌ చేసిందేమిటని ప్రశ్నించారు. 

అయోధ్య దోపిడీ గురించి, కాళేశ్వరం స్కామ్ గురించి, విభజన హామీలపై నబీన్‌‌‌‌ ఎందుకు మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. దేశంలో హిందూ దేవుళ్లు ఏ పార్టీకి సొంతం కాదని అన్నారు. నీట్ పరీక్షను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందని ఎద్దేవా చేశారు.  బీజేపీ ముక్త్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీకి చోటు లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, ఇక్కడ ఆ పార్టీ అవసరం కూడా లేదని చెప్పారు. 

రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారు..

ఎలక్షన్ కమిషన్‌‌‌‌ను చేతిలోకి తీసుకొని రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని బీజేపీపై మహేశ్‌‌‌‌గౌడ్ ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. బీజేపీ నేతలు ఓట్ల దొంగలని, మీనాక్షి నటరాజన్ సీటును చోరీ చేశారని మండిపడ్డారు. ‘సర్’ కార్యక్రమం ఓట్లను జత చేయాలి.. కానీ ఇది ఓట్ల తొలగింపు కార్యక్రమంలా మారిందన్నారు. బీజేపీ ముసుగులో ఇతర పార్టీలు రెచ్చగొట్టినా రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఢోకా లేదని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని, బీఆర్ఎస్‌‌‌‌కు శాశ్వతంగా ప్రతిపక్ష హోదానే అని పేర్కొన్నారు. 

తెలంగాణలో బీఆర్ఎస్‌‌‌‌కు నూకలు చెల్లాయనే విషయం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అర్థమైందని, అందుకే ఆయన ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కే పరిమితమయ్యారని అన్నారు. కేటీఆర్, హరీశ్‌‌‌‌కు ఇంకా ఏదో ఆశ ఉందని, ఈ ఇద్దరు ఎక్కడ తిరిగినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. యాదగిరి గుట్ట బోర్డు నియామకంపై రాజకీయాలు చేయడం తగదని, దేవుడి దగ్గర ప్రాంతాలు, కులాలు ఉండవన్నారు. టీటీడీ బోర్డులో తెలంగాణ వారు ఉన్నప్పుడు..అక్కడి వారు ఇక్కడ ఉండడంలో తప్పేముందని ప్రశ్నించారు. గుట్ట బోర్డు నియామకం విషయంలో తనను సంప్రదించలేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని పీసీసీ చీఫ్​ స్పష్టం చేశారు.