- మూడ్రోజుల క్రితం ప్రైవేట్ హెల్త్ క్యాంప్ లో బయట పడ్డ సమస్యలు
- 150 మందిలో 51 మంది అనారోగ్య బాధితులే
- 26 మందిలో 16 మందికి ఊపిరితిత్తుల సమస్య
- 35 మందికి చర్మవ్యాధులు
- చుట్టుపక్కల బస్తీల్లో 25 వేలమంది జనాభా
- అందరికీ టెస్టులు చేయాలని డిమాండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు : జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిసరాల్లోని జనాల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. మూడు రోజుల క్రితం నిర్వహించిన ఓ ప్రైవేట్ హెల్త్ క్యాంపులో ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. డంపింగ్ యార్డు పరిసర ప్రాంతంలోని కార్మిక నగర్ లో 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 51 మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
ఇందులో 26 మందికి లంగ్స్ పరీక్షలు నిర్వహించగా 16 మందికి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తేలింది. రోజూ డంపింగ్ యార్డు నుంచి వెలువడే దుర్వాసన, ధూళి కారణంగానే శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. మరో 35 మందిలో చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది.
ఈ ప్రాంతాల్లో ఇబ్బందులు....
యార్డు పరిసరాల్లో 25 వేలకిపైగా జనాభా నివసిస్తున్నారు. డంపింగ్ యార్డు విస్తీర్ణం 351 ఎకరాలు ఉంటుంది. దీని చుట్టుపక్కల 15 నుంచి 18 ప్రాంతాల్లో తీవ్రమైన దుర్గంధం, గాలి, నీటి కలుషితం సమస్య తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్, దమ్మాయిగూడ, కార్మిక నగర్, బాలాజీనగర్, గబ్బిలాలపేట, అంబేద్కర్‌నగర్, మల్కారం, రాజీవ్‌గాంధీ నగర్, శాంతి నగర్, ప్రగతి నగర్, హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, బీజేఆర్‌నగర్, అహ్మద్‌గూడ, తిమ్మాయపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి ప్రాంతాలతో పాటు సాయంత్రమైందంటే యాప్రాల్, సైనిక్ పురి, ఈసీఎల్ ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది.
దీంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. డంపింగ్ యార్డును శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడంతో పాటు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నాళ్లీ కష్టాలు
డంపింగ్ యార్డు పరిసరాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడం, దుర్వాసన, కాలుష్యం రాను రాను తీవ్రమవుతున్నది. ఇక్కడి బస్తీల్లో ఉండే నిరుపేదలు కనీసం అనారోగ్య సమస్యలను తెలుసునేందుకు టెస్టులు కూడా చేసుకోలేకపోతున్నారు. హెల్త్ సమస్యలు వస్తే బాలాజీనగర్ లోని హెల్త్ సెంటర్ కి వెళ్లి మెడిసిన్స్ తీసుకొని సరిపెడుతున్నారు.
బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ప్రపోజల్స్కే పరిమితం అయ్యింది. డంపింగ్‌యార్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తే ఎవరెవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది.
అధికారులు, ప్రజాప్రతినిధులు విజిట్ చేసినా.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై 40 రోజుల క్రితం ఎంఎంసీ కమిషనర్ ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు జవహర్ నగర్ డంపింగ్ యార్డుని విజిట్ చేసి అక్కడే సమావేశం నిర్వహించారు. రాంకీ సంస్థ చర్యలు తీసుకోవడంతో పూర్తిగా విఫలమయ్యారన్నారు. డంపింగ్ యార్డు వద్ద నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడం గుర్తించారు.
అలాగే సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రజల అభివృద్ధికి వినియోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించారు. ప్రజలకు తాగునీరు, సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని నిలదీశారు. త్వరలోనే మార్పు తీసుకురావాలని ఆదేశించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. కనీసం పరిసర ప్రాంతాల్లో రోడ్లపై పడుతున్న చెత్తని కడా క్లీన్ చేయడంలేదు. డంపింగ్ యార్డు లోపల కూడా కొత్తగా మర్పులు కనిపించడంలేదు.
